విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అశోక్ గజపతిరాజుకు అడుగడుగునా అవమానం జరిగింది. ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుండగా బాలాజీ జంక్షన్, కోట జంక్షన్ వద్ద పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు తన కుటుంబ సభ్యులను పూర్తిస్థాయిలో ఆలయంలోకి విడిచిపెట్టలేదు.
దీంతో ఆగ్రహించిన ఆయన దర్శనానికి వెళ్లకుండా మూడులాంతర్ల జంక్షన్ వద్ద ఉన్న పోలీస్ బీట్‌పై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ సిబ్బంది అక్కడికి వచ్చి ఆయన్ను బుజ్జిగించే ప్రయత్నం చేశారు. అయినా ఆయన పట్టువీడలేదు. ఇంతలో డీఎస్పీ కృష్ణప్రసన్న అక్కడికి వచ్చి ఏం జరిగిందని అడగడంతో అశోక్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు నాటకాలు ఎక్కువవుతున్నాయని, ఎవరి అండ చూసుకోని ఇలా చేస్తున్నారని ఆమెపై మండిపడ్డారు. దీంతో ఆమె కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతలో మరోసారి దేవస్థానం ఈవో భానురాజా వచ్చి అశోక్‌ను బుజ్జగించారు. దీంతో శాంతించిన ఆయన నిరసన విరమించి, అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
అరకొర సౌకర్యాలతో అవస్థలు
విజయనగరం రూరల్ : అధికార అరకొర ఏర్పాట్లు చేయడంతో ఉత్సవానికి వచ్చిన భక్తులు వర్షానికి తడిసిముద్దయ్యారు. అధికారులు క్యూలైన్లలో టెంట్లు, పందిళ్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు వర్షంలో తడుస్తూనే మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచే వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. అయితే అల్పపీడనం వల్ల సోమవారం రాత్రి నుంచే వర్షం పడుతోంది. అయినా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భారీ వర్షం పడడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చిన మహిళలు అవస్థలకు గురయ్యారు.
అశోక్‌కు అవమానం!
Published Wed, Oct 23 2013 3:49 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement