పోలీసుల ప్రజాసేవ
మక్కువ, న్యూస్‌లైన్: ప్రజలకు రక్షణ కల్పించడంతో తమ పని అ యిపోయిందని వారు భావించలేదు. తమ పరిధిలో ఉన్న అమాయక గిరిజన యువకులను ఆదుకోవాలని, వారికి సరైన శిక్షణ అందించి ఉపాధి కల్పించాలని భావించారు. అందుకు తగ్గట్టే విధులతో పాటు గిరిజనుల సేవా కార్యక్రమాలనూ బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు సీఆర్‌పీఎఫ్ పోలీసులు. మక్కువలో ఉన్న పోలీస్‌స్టేషన్ ఆవరణలో 2011 పిబ్రవరి 18న విశాఖపట్టణం 198 బెటాలియన్ నుంచి సీఆర్‌పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. అప్పటి నుంచే ఇక్కడ సేవా కార్యక్రమాలకు బీజం పడింది.
మండలంలోని పలు గిరిజన గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు వారి వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సివిక్ యాక్షన్ ప్రొగ్రాంలో భాగంగా మండలంలోని ఏ.వెంకంపేట గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో బోరు ఏర్పాటు చేశారు. అలాగే సీఆర్‌పీఎఫ్ కమ్యూనిటీ నిధులు రూ.లక్షతో అంటివలసలో మినీ రక్షిత మంచినీటి ట్యాంక్‌ను నిర్మించారు. అలాగే చెక్కవలస గిరిజన గ్రామంలో రూ.42వేలతో బోరు ఏర్పాటు చేశారు. ఇటీవల మెండంగి గ్రామంలో 1500 లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంక్‌లను కూడా ఏర్పాటు చేశారు. మరికొన్ని
పనులు ఇంకా నిర్మాణ దశల్లో ఉన్నాయి.
మండలంలోని నంద, దుగ్గేరు గ్రామాల్లో పోలీసు సిబ్బంది తరచుగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వారపు సంతలకు అధికంగా గిరిజనులు వచ్చే అవకాశం ఉన్నం దున ఆ సమయంలో శిబిరాలు నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే ఈ ఏడాది జనవరిలో మండలంలోని బొడ్డవలస గ్రామంలో దుప్ప ట్లు పంపిణీ చేయగా, మూలవలసలో గిరిజన మహిళలకు వంటపాత్రలు పంపిణీ చేశారు. గిరిజన యువత పెడదోవ పట్టకుండా ఉండేందుకు సీఆర్‌పీఎఫ్-ఎఫ్ 198 బెటాలియన్ ఆధ్వర్యంలో పలు క్రీడలు పోటీలను నిర్వహిస్తున్నారు. వాలీబాల్ పోటీలు, క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ బహుమతులు అందిస్తున్నారు. గిరిజన యువకులకు క్రీడా పరికరాలను కూడా అందిస్తున్నారు. క్రీడలపై ఆసక్తి కనబరిచిన గిరిజన గ్రామాలను గుర్తించి క్రీడా పరికరాలను అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లకు సంబంధించి అర్హత, ఆసక్తి గల యువతను గుర్తించి వారికి శిక్షణ కూడా అందిస్తున్నారు.
గిరిజన గ్రామాల్లో కూంబింగ్‌కు వెళ్లేటపుడు వారు ఎదుర్కొనే సమస్యలను గుర్తించాం. వారిని ఆదుకోవాలనే సంకల్పంతోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మున్ముందు కూడా ఇవి సాగుతాయి.
- రాజేశ్‌కుమార్ గుడ్డూ, సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్