నిబంధనలు ఉల్లంఘించి రోడ్లమీదకు వచ్చిన వాహనచోదకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు
అధికారులు ఆంక్షలు విధిస్తున్నా పట్టించుకోవడం లేదు. పాలకులు ఎన్ని ప్రకటనలు చేస్తున్నా పాటించడం లేదు. పక్క దేశాల్లో విపత్తును చూసి కూడా భయపడటం లేదు. ఎవరికి వారే తమకుతామే రక్షణలో ఉంటున్నామనుకుని వ్యవహరిస్తు న్నారు. సరకులు కొనుగోలు... అత్యవసర పనులంటూ వాహనాలేసుకుని బలాదూర్‌గా తిరుగుతున్నారు. లేనిపోని తలనొప్పులు సృష్టిస్తున్నారు.వారిని పోలీసులు కట్టడిచేస్తున్నారు. కౌన్సెలింగ్‌ఇచ్చి సున్నితంగానే హెచ్చరిస్తున్నారు.
సాక్షిప్రతినిధి, విజయనగరం: కరోనా మహమ్మా రి వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి జన తా కర్ఫ్యూను విజయవంతం చేసిన ప్రజలు లాక్‌డౌన్, 144 సెక్షన్‌లను మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్రభుత్వం, అధికారులు ఎంతగా చెబుతునప్పటికీ లెక్క చేయకుండా వివిధ కారణాలతోఇంటి నుంచి బయటకు వస్తున్నారు. రోడ్లమీదకు వస్తే కరోనా వైరస్ అంటుకుంటుందనే భయం లేకుండా వాహనాలెక్కి షికార్లు చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిని పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అప్పటికీ మార్పు రాకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని అంచనా వేస్తూ,తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.
విదేశాల నుంచి వచ్చిన వారు హౌస్ అరెస్ట్
విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే స్థానికులకు కరోనా వ్యాధి సంక్రమిస్తున్నందున జిల్లాలోని పలు ప్రాంతాలకు విదేశాల నుంచి తమ సొంత ఇళ్లకు ఇటీవలి కాలంలో వచ్చిన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. వారు తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేయాలని మండల స్థాయి అధికారులను కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ మంగళవారం ఆదేశించారు. కరోనా వైరస్ జిల్లాలో వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను తెలియజేస్తూ మండల, మునిసిపాలిటీ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై మండల స్థాయి అధికారులు, పోలీస్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లకు మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పలు సూచనలు చేశారు.
అధికారులకు ప్రత్యేక బాధ్యతలు
విదేశాల నుంచి వచ్చిన ఒక్కో వ్యక్తి కదలికలను నియంత్రించేందుకు ఒక్కో అధికారికి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వారు తమ ఇంటి నుంచి అడుగు బయట పెట్టకుండా చూసే బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాకు 321 మంది వివిధ దేశాల నుంచి వచ్చినట్టు తెలుస్తోందనీ, ఆయా మండలాలు, పట్టణాల్లో ఎంత మంది వాస్తవంగా ఉన్నదీ అధికారులు మరోసారి మండలం, పట్టణం, గ్రామాల వారీగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఏ వ్యక్తి పర్యవేక్షణ బాధ్యతలు ఏ అధికారికి అప్పగించారో వివరాలతో సహా జిల్లా కేంద్రంలోని కరోనా మానిటరింగ్ సెల్‌కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చేవారి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒకరు, జిల్లా పాలనా యంత్రాంగం నుంచి ఒకరిని నియమిస్తున్నట్టు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారికి వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించనప్పటికీ 14 రోజుల పాటు వారు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించరాదని స్పష్టం చేశారు. అధికారుల మాటను బేఖాతరు చేస్తే వారిని జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించి అక్కడే నిర్బంధిస్తామని హెచ్చరించారు.
రెండు డివిజన్లలో ఐదు క్వారంటైన్ కేంద్రాలు
జిల్లాలో కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా రెండు డివిజన్లలో ఐదు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయనగరం డివిజన్‌కు సంబంధించి జిల్లా కేంద్రంలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల, నెల్లిమర్లలోని మిమ్స్ వైద్య కళాశాలలోను, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలిలో మంగళవారం సాయంత్రానికి అందుబాటులోకి తెచ్చారు. ఈ కేంద్రాలకు అవసరమైన బెడ్లు, మంచాలు, ఇతర సామగ్రిని, సిబ్బందిని సమకూరుస్తున్నారు.
అధిక ధరలకు విక్రయించేవారిపై చర్యలు
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు పెంచి విక్రయిస్తున్నట్టు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చింది. అలాంటివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తామని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. పోలీస్, రెవెన్యూ, మునిసిపల్ శాఖలు సంయుక్తంగా ఇటువంటి వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో గంటస్తంభం, మార్కెట్, రైతు బజార్ల ప్రాంతంలో నిత్యావసరాలు, కూరగాయల కొనుగోలు నిమిత్తం ప్రజలు పెద్ద ఎత్తున గుంపులుగా ఒకే చోటకు చేరడం పట్టణ వాసులను కలవరపరిచింది. దీనికి పరిష్కారంగా ఇకపై వార్డుల వారీగా మొబైల్ వ్యాన్ల ద్వారా తీసుకువెళ్లి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి, గుంపులుగా చేరకుండా ఉండాల్సిన ఆవశ్యకతపై, నగరంలోని ఏయే ప్రాంతాల్లో సరకులు, కూరగాయలు విక్రయిస్తారో లౌడ్ స్పీకర్ల ద్వారా వివరిస్తున్నారు.
ప్రజాసమూహాల్లో ఉగాది వేడుకలు నిషిద్ధం
జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ పంచాంగ శ్రవణం, ఉగాది వేడుకలు నిర్వహించడానికి అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు తమ ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామి సొంత నిధులతో జి ల్లా కేంద్రంలోని 50 వార్డుల్లో మందు స్ప్రే చేసేందుకు మెషీన్లు సమకూర్చారు. మిగిలిన ఎమ్మెల్యేలు అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
దుకాణాలు తెరిచే ఉంటాయి
జిల్లాలో నిత్యావసర సరకుల దుకాణాలు ఉదయం 6 గంటలనుంచి రాత్రి 8 గంటలవరకూ తెరిచే ఉంటాయని కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోల్‌సేల్ దుకాణాలు, పాలకేంద్రాలు, కూరగాయల దుకాణాలు కూడా తెరిచే ఉంటాయని, విజయనగరం గంటస్తంభం ప్రాంతంలోని కూరగాయల దుకాణాలను మాత్రం బుధవారం నిలుపుదల చేసి, గురువారం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment