దేవరకొండ, న్యూస్‌లైన్: దేవరకొండ సహకార బ్యాంకు వ్యవహారం ఓ కొలిక్కివస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని రిమాండ్ చేయగా, శుక్రవారం మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే అవినీతిపై మొదట నుంచి కో అంటే కోట్లు అన్నట్లుగా రెండంకెల సంఖ్యలో రూ.కోట్లను లెక్కేసినా చివరకు విచారణ అనంతరం రూ.4కోట్ల నుంచి 6కోట్ల రూపాయల మేర అవినీతి జరిగి ఉండవచ్చునని విచారణ అధికారులు, బ్యాంక్ అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. డీసీసీబీ ఇన్‌చార్జ్ చైర్మన్ పాండురంగారావు బృందం శుక్రవారం దేవరకొండకు వచ్చి డీఎస్పీ మనోహర్‌ను కలిసి విచారణ తీరును తెలుసుకున్నారు. వారు విచారణపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేసు స్థితి, బ్యాంకులో జరిగిన అవకతవకలకు సంబంధించిన వివరాలను పాండురంగారావు, డీఎస్పీ మనోహర్‌లు విలేకరులకు వివరించారు.
గత సంవత్సరం మార్చి నుండి ఇప్పటి వరకు దేవరకొండ సహకార బ్యాంక్‌లో రూ.45.25లక్షల లావాదేవీలు జరిగినట్లు వారు తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పంట రుణాలు ఇచ్చిన మొత్తం రూ.9 కోట్లని తెలిపారు. ఇందులో రూ.21.50లక్షలు బంగారంపై రుణాలివ్వగా, కొత్తగా వచ్చిన బ్రాంచీలకు రూ.2.58లక్షలు అందించినట్లు పేర్కొన్నారు. వీటితోపాటు రూ.10.50లక్షల ఎల్‌టీ లోన్‌లు మంజూరు చేసినట్లు తెలిపారు. అయితే సహకార బ్యాంక్‌లో ఇప్పటివరకు రూ.9.05కోట్ల రుణాలివ్వగా అందులో సింహభాగం అవినీతి జరిగినట్లు భావించినా రూ.4కోట్ల నుంచి రూ.6కోట్లలోపే అవినీతి జరిగి ఉండవచ్చునని వారు భావించారు.
ఇదిలా ఉండగా మరో కోణంలో విచారణ చేపట్టాల్సి ఉందని.. వాస్తవంగా రికార్డుల ప్రకారం రైతులకు మంజూరు చేసిన పంట రుణం ఎంత..? అందులో రైతులకు ముట్టింది ఎంత? అనే విషయాలకు కూడా వారు విచారణ చేయాల్సి ఉందన్నారు. అయితే కో ఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ఒక్కో రైతును విడివిడిగా తీసుకున్న అప్పుపై విచారణ చేయడానికి కో ఆపరేటివ్ రిజిస్ట్రార్ అనుమతి కోసం ప్రతిపాధనలు పంపినట్లు తెలిపారు. అయితే ఆ యాక్ట్ ప్రకారం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆమోదం లభిస్తే ఆ వైపు నుంచి విచారణ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు.
నాబార్ట్ నిధులతో ధాన్యం నిల్వ
కేంద్రాలు..
నాబార్ట్ నిధులతో డీసీసీబీ నుండి ధాన్యం నిల్వ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నట్లు పాండురంగారావు తెలిపారు. స్థలం, సొసైటీ రిజిస్ట్రేషన్‌తోపాటు అర్హులైన వారు ధాన్యం నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నిల్వ కేంద్రాల నిర్వహణకు ఒక్కో మెట్రిక్ టన్నుకి రూ.4వేల చొప్పున 200 మెట్రిక్ టన్నుల వరకు నిల్వ కేంద్రాలు నిర్మించడానికి అనుమతులు ఇస్తామన్నారు. జిల్లాలోని 107 సొసైటీల పరిధిలో 187 గోదాములున్నాయని, అవసరమైన గోదాముల మరమ్మత్తుకు లక్షా 25వేల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. విచారణ తీరును పరిశీలించడానికి వచ్చిన బృందంలో పాండురంగారావుతోపాటు డీసీసీబీ సీఈఓ భాస్కర్‌రావు, డెరైక్టర్ లింగయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రావులున్నారు.
ఇరువురు రిమాండ్...
సహకార బ్యాంక్ అవినీతి కేసులో పాత్రధారులైన మరో ఇరువురిని దేవరకొండ డీఎస్పీ మనోహర్ అదుపులోకి తీసుకొని విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న చందంపేటకు చెం దిన చిన్నా , తుల్జానాయక్‌లను అరెస్ట్ చేసి శుక్రవారం సాయంత్రం కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే రెండు సొసైటీల పరిధిలో విచారణ పూర్తయిందని, మరికొన్ని రోజులో పూర్తిస్థాయిలో విచారణ ముగిస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరిస్తున్నామని ఆయన తెలిపారు.
కొలిక్కి వస్తున్న డీసీసీబీ కేసు
Published Sat, Feb 8 2014 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement