కర్నూలు, న్యూస్‌లైన్: సొంత శాఖ ప్రక్షాళనకు ఎస్పీ నడుంబిగించారు. ఈ విషయంలో ఆయన బదిలీకి కూడా వెనుకాడకపోవడం తెలిసిందే. తాను ఇబ్బందులు ఎదుర్కొన్నా.. సిబ్బందిని ఎవ్వరూ వేలెత్తి చూపకూడదనే ఉద్దేశం ఆయనది. ఆ దిశగానే ఆయన ముందుకు సాగుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అలాంటి అధికారి ఆదర్శంగా ముందుకు సాగాల్సిన కింది స్థాయి ముఖ్య అధికారులు కొందరు మామూళ్ల మత్తు నుంచి బయటపడలేకపోతున్నారు. ఎవరెలా ఉన్నా.. మేమింతే అన్న రీతిలో దందా సాగిస్తున్నారు. అదీ జిల్లా కేంద్రంలోనే ఉంటున్న ఈ పెద్ద సారు ఎలాంటి జంకూబొంకూ లేకుండా చేయి చాస్తున్నారు. తనకు ఎస్పీ అండదండలు ఉన్నాయనే ప్రచారంతో వసూళ్లకు పాల్పడటం ఈయన ప్రత్యేకత. చోరీలు.. దోపిడీలు.. హత్యలు.. ఇలాంటి కేసులు ఏవైనా ఆయనకు ఆదాయ వనరులే. ఇటీవల ఓ గొలుసు దొంగను అరెస్ట్ చూపేందుకు రూ.30 వేలు ముడుపు తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. నగరంలో మద్యం సిండికేట్ నుంచి ప్రతి నెలా పోలీసులకు అందుతున్న మామూళ్లు రూ.4 లక్షలు కాగా.. ఈయన వాటాగా రూ.లక్ష అందుతున్నా రెట్టింపు చేయాలని ‘సిండికేట్’కు కొద్ది రోజుల క్రితం హుకుం జారీ చేసినట్లు సమాచారం.
ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఇటీవల ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. పోలీసుల అనుమతి లేకుండా ఎలా నడుపుతావంటూ నిర్వాహకున్ని బెదిరించి రూ.60 వేల దాకా లాగినట్లు కింది స్థాయి సిబ్బంది ద్వారా తెలిసింది. దీపావళి సందర్భంగా బాణసంచా వ్యాపారుల నుంచి దుకాణానికి రూ.10వేలు చొప్పున ముడుపులు గుంజినట్లు సమాచారం. సొంత శాఖ సిబ్బందినీ వదలకపోవడం ఈ అధికారి ప్రత్యేకత. వారిపై వచ్చే అవినీతి ఆరోపణలు ఈయనకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. విచారణ పేరిట బెదిరించడం.. అనుకున్న మొత్తం ముట్టగానే తానున్నానని అభయమివ్వడం ఆయనకే చెల్లుతోంది. స్టేషన్ల తనిఖీల పేరుతో కూడా రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు ఇవ్వనిదే వదలరని సమాచారం. అదేవిధంగా జిల్లాలోని ప్రజా ప్రతినిధుల మధ్య ఉన్న ఆధిపత్య పోరును కూడా ఈ అధికారి తనకు అనుకూలంగా మల్చుకున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ తన సీటుకు డోకా లేకుండా నెట్టుకొస్తున్నారు.
ఎక్కడ నేరం ఉంటుందో.. అక్కడ అక్రమార్జనకు అవకాశం ఉంటుందని సూత్రంలో ఈయన ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఎక్కడ విధి నిర్వహణలో ఉన్నా.. ముందుగా ఆయా ప్రాంతాల్లో జరిగే నేరాలు ఎలాంటివనే విషయంపైనే ఆరా తీస్తారనే పేరుంది.అప్పటి వరకు పని చేసిన అధికారి రేట్లకు రెట్టింపుతో తన దందా మొదలు పెడతాడనే గుర్తింపు ఈయన సొంతం. సాధారణంగా యథా రాజా తథా ప్రజ అంటారు. అయితే జిల్లా పోలీసు బాస్ నిజాయితీ, ముక్కుసూటి తనంతో ముందుకు సాగుతుండగా.. ఈ సారు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం కింది స్థాయి సిబ్బందిలో చర్చకు తావిస్తోంది.