
రాజకీయ కుట్ర
► నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యేలపై వేధింపుల పర్వం
► సీఎం పేషీ నుంచి పోలీసులకు ఆదేశాలు
► నంద్యాల ఉప ఎన్నికలో చురుగ్గా ప్రచారం నిర్వహించారనే అక్కసు
► బెట్టింగ్ కేసులో ఎమ్మెల్యేల పాత్ర లేదని మూడుసార్లు ప్రకటించిన ఎస్పీ
► చివరకు నోటీసులు జారీ
► నేడు ఎస్పీ ఎదుట హాజరు కానున్న కోటంరెడ్డి, అనిల్‌కుమార్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : బెట్టింగ్ రాకెట్ వ్యవహారం పోలీసుల చేయి దాటిపోయింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పాత్రధారులుగా మిగలగా.. తెరవెనుక ప్రభుత్వ పెద్దలు సూత్రధారులై రాజకీయ కుట్రకు తెరలేపారు. ముగిసిపోయిన కేసును మళ్లీ తెరిచి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను వేధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం, నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో బలమైన కేడర్ పెంచుకుని నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రభుత్వం టార్గెట్ చేసింది.
క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో సాక్ష్యాల కోసం విచారణకు రావాలంటూ వారిద్దరికీ నోటీసులు జారీ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సీఎం పేషీ ఆదేశాల మేరకు మొన్నటి వరకు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ చేతిలో ఉన్న బెట్టింగ్ రాకెట్ కేసు వ్యవహారం ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరింది. పోలీస్ ఉన్నతాధికారులు సీఎం పేషీ నుంచి అందుతున్న ప్రత్యేక ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. బెట్టింగ్ వ్యవహారంలో ఎమ్మెల్యేల పాత్ర లేదని జిల్లా ఎస్పీ రామకృష్ణ మూడుసార్లు ప్రకటించారు.
కృష్ణసింగ్ అరెస్ట్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు. మారిన రాజకీయ సమీకరణలు, నంద్యాల ఉప ఎన్నిక వేడి వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్ష సాధింపు చర్యలకు దిగి ఈ కేసును పావుగా వాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలకు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 16వ తేదీన సిద్ధం చేసిన నోటీసులను 20వ తేదీన వారికి నంద్యాలలో అందజేశారు.
ఈనెల 22న విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. వాస్తవానికి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం తీవ్ర దుమారమే రేపింది. ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ బాధ్యతలు స్వీకరించాక బెట్టింగ్ రాకెట్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో రెండు పర్యాయాల్లో 230 మంది వరకు బుకీలు, పంటర్లను అరెస్ట్ చేశారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నేతలతోపాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారందరినీ అరెస్ట్ చేశారు. ఇంతవరకు పోలీసులు అత్యంత సమర్ధవంతంగా కేసును కొనసాగించారు.
జిల్లా ఎస్పీ తీరుపై సర్వత్రా ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి. కేసులో ముగ్గురు కీలక వ్యక్తులు మాత్రమే అరెస్ట్ కావాల్సి ఉందని, వారి అరెస్ట్ పూర్తయ్యాక కేసు ముగుస్తుందని గతంలోనే పోలీసులు ప్రకటించారు. కీలక బుకీగా ఉన్న కృష్ణసింగ్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి న్యాయపరంగా ముందుకు సాగడానికి వీలుగా నిపుణులతో సంప్రదించి ఆ మేరకు కసరత్తు మొదలుపెట్టారు. బెట్టింగ్ వ్యవహారంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన బ్రహ్మనాయుడు, దువ్వూరు శరత్‌చంద్ర, అతని కుమారుడు దొరకాల్సి ఉండగా.. వీరిలో బ్రహ్మనాయుడు పోలీసులకు లొంగిపోవడంతో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇక శరత్‌చంద్ర, అతని కుమారుడు మాత్రమే దొరకాల్సి ఉంది. దీంతో కేసు కూడా దాదాపుగా ముగిసినట్టే.
ఏం లేదంటూనే నోటీసులు
బెట్టింగ్ వ్యవహారం మొదలైనప్పటి నుంచీ ఎమ్మెల్యేలెవరికీ సంబంధం లేదని చెబుతూనే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 3వ తేదీన కృష్ణసింగ్‌ను అరెస్ట్ చేసిన సందర్భంలో ఎస్పీ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్యు ల పాత్ర లేదని, తమకు ఆ దిశగా తమకు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని చెప్పారు. తర్వాత 14వ తేదీన ఎల్లో మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎస్పీని కలసి ఎవరి పాత్ర ఉన్నా అరెస్ట్ చేసి విచారించమని కోరారు. ఎవరి పాత్రకు సంబంధించి ఇప్పటివరకు ఆధారాలు లేవని ఆయనకు ఎస్పీ స్పష్టం చేశారు.
18వ తేదీన వెంకటగిరి పోలీసు స్టేషన్ తనిఖీకి వెళ్లిన ఎస్పీ అక్కడి విలేకర్లతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇలా ఏమీ లేదని మూడుసార్లు చెప్పి.. చివరకు నోటీసులు జారీ చేయడం వెనుక ఆంతర్యంపై జిల్లా అంతటా చర్చ సాగుతోంది. ఉన్నత స్థాయినుంచి పోలీసులకు ఒత్తిళ్లు రావడం వల్లే ఇలా చేసినట్టు తెలుస్తోంది. సీఎం పేషీ నుంచి కూడా పోలీసు బాస్‌లపై ఒత్తిళ్లు పెరగడంతో నోటీసులు జారీ అయినట్టు సమాచారం.
కొన్ని సాక్ష్యాలు సేకరించాలని, అలాగే కొన్ని అంశాలపై స్పష్టత కోసం గంట సమయం మాత్రమే విచారణ జరుపుతామని ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. అయితే రాజకీయంగా దెబ్బతీయడానికే పోలీసుల ద్వారా అధికార పార్టీ ఈ చర్యకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.