ఎగసిపడ్డ కన్నీటికెరటం
► నిషిత్ మరణంతో శోక సంద్రంలో ఆప్తులు
► హాజరైన పార్టీశ్రేణులు, ప్రముఖులు
నెల్లూరు(టౌన్) : రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పొంగూరు నారాయణ ఏకైక కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో కుటుంబ సభ్యులు , బంధువులు తల్లడిల్లి పోయారు. చిన్న తనం నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్న నిషిత్ అకాల మరణ వార్తను తట్టుకోలేక కుటుంబ సభ్యులతో పాటు నారాయణ విద్యాసంస్థల íసిబ్బంది కన్నీరు మున్నీరయ్యారు.
నిషిత్ మరణ వార్త తెలుసుకున్న పలువురు టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కి తరలివెళ్లారు. 22 ఏళ్లకే నూరేళ్లు నిండాయా అంటూ విలపించారు. మంత్రి నారాయణ విదేశీ పర్యటనలో ఉండటంతో పార్టీ మంత్రులు, నాయకులు సంఘటనస్థలికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
చురుకైనవాడు
మంత్రి పొంగూరు నారాయణకి ఒక్క కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. చిన్నవాడైన కుమారుడు నిషిత్ 1994 జూలై, 4న నెల్లూరులో జన్మించాడు. విద్యావిషయాలతో పాటు అన్నిరంగాల్లో చురుగ్గా వ్యవహరించేవాడు. నెల్లూరు హరనాథపురంలోని నారాయణ కాన్సెప్ట్ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివారు. ఆరు నుంచి పదోతరగతి వరకు హైదరాబాద్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. అనంతరం ఇంటర్మీడియట్‌ను బెంగళూరులోని ఇండస్ ఇంటర్నేషనల్ కళాశాలలో పూర్తి చేశాడు. సింగపూర్‌లో బ్యాచిలర్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేశాడు.
రెండేళ్ల క్రితమే డైరెక్టర్‌గా బాధ్యతలు
తండ్రి నారాయణ బాధ్యతలు పంచుకోవడంలో నిషిత్ ఎప్పుడూ ముందుండేవాడు. అటు కుటుంబ సభ్యులు ఇటు బంధువులతో కలివిడిగా ఉంటూ అందరివాడుగా మన్ననలు పొందాడు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి యజమాని కంటే కూడా తోటి సభ్యుడిగా ఉంటూ వారి బాధలను పంచుకుంటారని చెబుతున్నారు. బీబీఎం కోర్సు చదువుతున్న సమయంలోనే వారంలో ఐదు రోజులు కళాశాలకి వెళ్లి మిగతా రెండు రోజులు సంస్థ బాధ్యతలు నిర్వహించేవాడు.
తండ్రి నారాయణ రాజకీయాల్లో తీరిక లేకుండా గడుపుతుండటంతో విద్యాసంస్థల బాధ్యతలను నిషిత్ స్వీకరించాడు. రెండేళ్ల క్రితం నుంచి నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టాడు. దేశవ్యాప్తంగా ఉన్న నారాయణ విద్యా సంస్థలను పర్యవేక్షిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడిప్పుడే వృద్ధిచెందుతున్న నిషిత్ అకాల మరణం చెందడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.