= సమైక్య ఉద్యమానికి ముఖం చాటేశారు
= రచ్చబండలో హంగామా చేశారు
= తుపానుల సాకుతో మంత్రి జనంలోకి వచ్చారు
= కాంగ్రెస్ నేతల పాలి‘ట్రిక్స్’
= ఈసడించుకుంటున్న ప్రజలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్ర విభజనను అడ్డుకోలేరు.. సమైక్యవాదాన్ని వినిపించలేరు.. ప్రజాభీష్టం నెరవేర్చలేరు.. ప్రజల కష్టాలను పట్టించుకోరు.. కానీ తమ రాజకీయ ఉనికిని చాటుకునేందుకు మాత్రం తుపానులను సైతం వాడుకుంటారు.. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు మాత్రం తుపాను రాజకీయాన్ని నెరపుతారు.. ఇదీ కాంగ్రెస్ నేతల తీరుపై జిల్లాలో సాగుతున్న చర్చ. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు పై-లీన్ తుపానును అడ్డుపెట్టుకున్నారు.. జిల్లాలో మేమున్నామని ఉనికిని చాటుకునేందుకు హెలెన్, లెహర్ తుపానులను వాడుకున్నారు. ప్రకృతి ప్రకోపించి సామాన్యుడి నుంచి రైతన్న వరకు చితికిపోయిన తరుణంలోనూ కాంగ్రెస్ మంత్రి కొలుసు పార్థసారథి తుపాను రాజకీయం నెరపారన్న విమర్శలు వినవస్తున్నాయి.
నిన్న ముఖం చాటేసి.. నేడు పాలి‘ట్రిక్స్’...
కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న యూపీఏ సర్కార్ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం జిల్లాలో ఆ పార్టీకి అడ్రస్ లేకుండా చేసింది. ఇటువంటి తరుణంలో ప్రచార ఆర్భాటాలు చేసే ఎంపీ లగడపాటి రాజగోపాల్ సహా జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రజలకు ముఖం చూపించే సాహసం చేయలేదు. ఉవ్వెత్తున సాగిన ఉద్యమంతో దాదాపు రెండున్నర నెలలపాటు జిల్లాలోని రోడ్లపై తిరిగేందుకే కాంగ్రెస్ నేతలు వెనకడుగు వేశారు.
అటువంటి తరుణంలో కోస్తాంధ్రాను వణికించిన పై-లీన్ తుపాను సహాయక చర్యల కోసం మానవతాదృ క్పథంతో సమ్మె విరమించాలంటూ కాంగ్రెస్ సర్కార్ తుపాను పేరుతో రాజీ ఫార్ములాను పండించింది. ఒడిశా, ఉత్తరాంధ్రలోను ప్రభావం చూపిన పై-లీన్ తుపాను సాకుతో కృష్ణా జిల్లాలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ సమైక్య సమ్మెపై నీళ్లు చల్లింది. అంతలోనే ఎత్తుగడగా రచ్చబండ పెట్టి జనాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. మండలాల వారీగా ఏర్పాటుచేసిన రచ్చబండ సభల్లో ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు, బంగారుతల్లి, ఇందిరమ్మ కలలు వంటి పథకాలను ఎరవేసి సమైక్య సెగ తగలకుండా ఎత్తుగడ పన్నారు.
జిల్లాకు చెందిన మంత్రి సారథి పోలీసుల పహరాలో రచ్చబండ సభలు నిర్వహించి రాజకీయ ఉపన్యాసాలు చేశారు. ఇంతలోనే హెలెన్ తుపాన్ రావడంతో మంత్రి, దిరిశం పద్మజ్యోతి, బూరగడ్డ వేదవ్యాస్, మల్లాది విష్ణుతో పాటు మరికొందరు నేతలు జనంలోకి వచ్చేందుకు దీన్ని వాడుకున్నారు. నవంబర్ 28న తీరాన్ని తాకిన లెహర్ తుపానును అడ్డుపెట్టుకుని మంత్రి సారథి జిల్లాలో విస్తృతంగా తిరిగే ప్రయత్నం చేశారు. ఇదే అదనుగా ప్రజలకు చేరువయ్యేందుకు తాపత్రయ పడ్డారు.
కష్టాల్లో ఉన్న ప్రజలు మాత్రం తుపాను రాజకీయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న తమను ఆదుకునేవారి కోసం ప్రజలు, రైతులు ఎదురుచూశారు. నిన్నటివరకు ముఖం చాటేసిన కాంగ్రెస్ నాయకులు తుపాను పేరుతో తమ వద్దకు వచ్చారన్న సంగతిని జనం మరిచిపోలేదు. ఇదే సమయంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు పర్యటించి రైతులకు మనోధైర్యాన్ని ఇచ్చారు.
కృష్ణాజలాల పైనా మొసలికన్నీరే....
ఒకపక్క కృష్ణాజలాలపై వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి కార్యక్రమాలూ చేపట్టలేదని, కేవలం మొసలి కన్నీరు మాత్రమే కారుస్తున్నారని రైతు నాయకులు విమర్శిస్తున్నారు. మరోపక్క పూర్తిగాని పులిచింతల ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసేందుకు ముఖ్యమంత్రి వస్తున్నట్లు మంత్రి సారథి ప్రకటించడంపై కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రస్తుత కష్టకాలంలో రైతన్నకు అండగా ఉండకుండా కేవలం సమావేశాలకే పరిమితం కావడంపై రైతు సంఘాల నాయకులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇదేసమయంలో కృష్ణా డెల్టాను ఎడారి చేసే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రైతులతో కలసి ఆందోళనలను ప్రారంభించింది. ఉభయ జిల్లాలకు చెందిన వందలాది మంది రైతులతో శనివారం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఆ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
జనంలోకి వెళ్లలేక.. కాంగ్రెస్‌లో ఇమడలేక..
జిల్లా కాంగ్రెస్‌లోని పలువురు నాయకుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించి అడ్రస్ గల్లంతయ్యే కాంగ్రెస్‌లో ఇమడలేక చాలామంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు మధనపడుతున్నారు. కాంగ్రెస్‌లో ఉంటే జనంలోకి ఎలా వెళ్లేదని పలువురు అంతర్మథనంలో పడ్డారు. ఇప్పటివరకు మంత్రి సారథి తన అధికార దర్పాన్ని అడ్డుపెట్టుకుని జనంలోకి వచ్చారు. మిగిలిన ఒకరిద్దరు నేతలు మినహా ప్రజల ముందుకు వెళ్లేందుకు ముఖం చెల్లటంలేదు. దీంతో సమైక్యాంధ్రకు జై కొట్టి జనాన్ని మెప్పించే ప్రయత్నం చేయడమా? కాంగ్రెసేతర పార్టీల్లో చేరి రాజకీయాల్లో కొనసాగడమా? అని మార్గాలను అన్వేషిస్తున్నారు.
తుపాను రాజకీయం
Published Sun, Dec 1 2013 2:31 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement