తిరుపతి ఉప ఎన్నికకు ప్రారంభమైన పోలింగ్
బరిలో 13 మంది అభ్యర్థులు
నగదు, మద్యంతో ప్రలోభాలు
గెలుపుపై టీడీపీ, కాంగ్రెస్‌ల ధీమా
తిరుమల: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైది. తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ (టీడీపీ) 2014 డిసెంబర్ 15న అనారోగ్యంతో మృతి చెందడంతో ఉపఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నిక బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2,94,781 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45,886 మంది కొత్త ఓటర్లు కూడా ఉన్నారు. 256 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ ప్రారంభం కాలేదు.
ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. పోటీలో దివంగత ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ సతీమణి సుగుణ (తెలుగుదేశం), ఆర్.శ్రీదేవి (కాంగ్రెస్), ఆసాది వెంకటాద్రి (రాష్ట్రీయ క్రాంతికారి సమాజ్‌వాదీ పార్టీ), కల్లూరి బాలసుబ్రహ్మణ్యం (లోక్‌సత్తా), నాగవేటి సుబ్రహ్మణ్య ఆచారి (అఖిల భారతీయ జనసంఘ్)తో పాటు మరో ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఈ ఉప ఎన్నికలో గెలుపును ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ప్రలోభాల పర్వం కనిపించింది. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల్లో ఇద్దరు ముగ్గురు నగదు, మద్యం పంపిణీపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఉప పోరులో గెలుపుపై టీడీపీ ధీమాగా ఉంది.