రేపే అసెంబ్లీ కమిటీ హాల్ 1లో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 16 ఏళ్ల అనంతరం రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. 1998లో రాష్ట్రంలో ఆరు స్థానాలకు ఏడుగురు పోటీపడటంతో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత జరిగిన రాజ్యసభ ఎన్నికలన్నీ ఏకగ్రీవమయ్యాయి. మళ్లీ ఈసారి పోలింగ్ జరుగుతోంది. ఈసారి కూడా ఆరు స్థానాలకు ఏడుగురు రంగంలో ఉండటంతో పోలింగ్ అనివార్యమైంది. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్ నె ంబర్ 1లో పోలింగ్ జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటారని అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి డాక్టర్ రాజసదారాం తెలిపారు.
అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, అది పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో శాసన సభ్యుల సంఖ్య 294. ఆంగ్లో ఇండియన్ కోటా కింద నియమితులయ్యే ఎమ్మెల్యేకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు లేదు. ప్రస్తుతం అసెంబ్లీలో 15 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా ఎమ్మెల్యేల్లో సుమన్ రాథోడ్ (టీడీపీ), జనార్దన్ థాట్రాజ్ (కాంగ్రెస్), సీహెచ్ రమేష్ (టీఆర్‌ఎస్)లకు కోర్టు ఆదేశాలతో ఓటు హక్కు లేదు. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో 276 మంది ఎమ్మెల్యేలు ఓటువేయనున్నారు.
రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, టి.సుబ్బరామిరెడ్డి, టీడీపీ నుంచి గరికపాటి మోహన్‌రావు, సీతారామలక్ష్మి, టీఆర్‌ఎస్ నుంచి కె.కేశవరావులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా బరిలో ఉన్నారు. 2003 ప్రజాప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణను అనుసరించి రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. అభ్యర్థులను నిలబెట్టిన ప్రతి పార్టీ తరఫున పోలింగ్ బూత్‌లో ఒక ఏజెంటు ఉంటారు. ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తున్నారో తమ పార్టీ ఏజెంటుకు తప్పనిసరిగా చూపించాలి. లేనిపక్షంలో ఆ ఓటు పోల్ కాదు. ఈసారి అసెంబ్లీ సమావేశం లేకపోవడంతో ఎమ్మెల్యేలు కేవలం ఓటు వేసి వెళ్లనున్నారు.
ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి: ఆదాల ప్రభాకర్‌రెడ్డి
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ ఎన్నికల్లో సమైక్యానికి ఓటువేయడం ద్వారా ఎమ్మెల్యేలు తమ గళాన్ని గట్టిగా వినిపించాలని అన్నారు.
రాజ్యసభ స్థానాలకు.. 16 ఏళ్ల తరువాత పోలింగ్
Published Thu, Feb 6 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
Advertisement
Advertisement