వాచీ లాంటి ఫోన్ తో హైటెక్ కాపీయింగ్
కదిరి : చేతి గడియారం రూపంలో ఉన్న సెల్‌ఫోన్తో హైటెక్ కాపీయింగ్కు పాలపడుతున్న ఓ విద్యార్థి ఇన్విజిలేటర్కు దొరికిపోయాడు. వివరాల ప్రకారం...అనంతపురం జిల్లా ఓడిచెరువు మండలం గౌనిపల్లికి చెందిన ఇలియాజ్ అనే విద్యార్థి కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం మొదటి సంవత్సరం పరీక్షలో హైటెక్ పద్ధతిలో కాపీ కొడుతూ ఇన్విజిలేటర్ శ్రావణ్‌కు దొరికిపోయాడు. పరీక్ష సమయంలో విద్యార్థి తన ఎడమ చేతికి పెట్టుకున్న రిస్ట్‌వాచ్ వైపు పదే పదే చూస్తూ పరీక్ష రాస్తుండటంతో గమనించిన ఇన్విజిలేటర్ అనుమానంతో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సెల్‌ఫోన్ విభాగాలన్నీ ఆ రిస్ట్‌వాచ్కు అమర్చి ఉన్నాయి.
20ప్రశ్నలకు సమాధానాలు అందులో మెసేజ్‌ల రూపంలో ఉన్నాయి. వెంటనే ఇన్విజిలేటర్ అతన్ని ఆ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మిరెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ విద్యార్థి తాను హైటెక్ పద్ధతిలో కాపీ కొడుతున్న విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇంటి దగ్గర ఉన్న తన సెల్‌ఫోన్లో సమాధానాలన్నీ ఫీడ్ చేసి.. చేతి గడియారం రూపంలో ఉన్న ఈ సెల్‌కు అన్నీ సెండ్ చేశానని, ఇందులో ఒక మెసేజ్‌ను డిలీట్ చేయగానే, అందులోని ఇంకో మెసేజ్(సమాధానం) వచ్చి చేరుతుందని అతను ప్రాక్టికల్‌గా చూపాడు. దీంతో ఆ విద్యార్థిని డిబార్ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రకటించారు.