అనంతపురం సప్తగిరి సర్కిల్ : దేశవ్యాప్తంగా మహిళల ఆత్మరక్షణకు పాఠశాలల స్థాయిలోనే యుద్ధ కళలు నేర్పాలని అర్జున అవార్డు గ్రహీత పూనమ్ చోప్రా అభిప్రాయపడ్డారు. అనంతలో జరుగుతున్న రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ముఖ్య అతిథిగా ఆమె విచ్చేశారు. అనంతరం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనేక విషయాలు పంచుకున్నారు. హర్యానా రాష్ట్రానికి చెందిన పూనమ్ 1984 నుంచి ఇప్పటి వరకు జూడో క్రీడలో ఉంటూ 35 సార్లు ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. వివిధ కేటగిరీలకు చెందిన 22 మెడల్స్‌ను అందుకున్నారు.
సాక్షి: జూడో క్రీడ గురించి మీ మాటల్లో ..
పూనమ్: మార్షల్ ఆర్ట్స్‌లో మొదటి స్థానంలో జూడో క్రీడ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రీడ అత్యంత ప్రాచుర్యం పొందింది. కాలి వేలి నుంచి తల జుట్టు వరకూ ఈ క్రీడ ఉపయోగపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా జూడో క్రీడ 2వ స్థానంలో ఉంది. ఈ క్రీడను 1984 నుంచి ఆడుతున్నా. ఇప్పటి వరకు ఈ క్రీడకు ప్రాతినిధ్యం వహించా.
సాక్షి: ఒలింపిక్స్‌లో ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించారా?
పూనమ్: ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున 1996లో ప్రాతినిధ్యం వహించా. ఏషియన్ గేమ్స్‌లో 29 ఏళ్ల తరువాత 1993లో చైనాలోని మకావూలో నిర్వహించిన జూడో క్రీడలో సిల్వర్ మెడల్ సాధించా. 1994లో జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన ఏకైక మహిళగా కీర్తిని సాధించా.
సాక్షి: మహిళల ఆత్మరక్షణకు జూడో క్రీడ ఏవిధంగా ఉపయోగపడుతుంది?
పూనమ్: జూడో క్రీడ అంటేనే సెల్ఫ్ డిఫెన్స్ అని అర్థం. ఇందులో బ్లాక్ బెల్ట్ సాధించిన వారు నాతోపాటు నలుగురి నుంచి ఐదుగురిని రక్షించగలదు. ప్రత్యర్థి వద్ద తుపాకి, నాన్‌చాక్, చాకు వంటి ఆయుధాలను సైతం ఎదుర్కునేందుకు వీలుంటుంది. ఈ క్రీడను రెజ్లింగ్‌లో అంతర్భాగంగా చెప్పొచ్చు. కానీ జపాన్‌కు సంబంధించిన క్రీడా పరిభాష దీనిలో మిళితమై ఉంటుంది. దీంతో పూర్తి ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంది.
సాక్షి: ఏఏ దేశాల్లో ఈ క్రీడ ప్రాచుర్యం పొందింది.
పూనమ్: ఈ క్రీడ ప్రధానంగా రష్యా, ఫ్రాన్స్, క్యూబా, కొరియా, జపాన్ దేశాల్లో అత్యధిక సంఖ్యలో దీన్ని ఆడతారు. తరువాత స్థానంలో భారత్ ఉంది.
సాక్షి: క్రీడలకు దేశంలో ఎలాంటి ఆదరణ లభిస్తుంది?
పూనమ్:ప్రభుత్వాలు చేయూతనందించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయస్థాయికి ఎదిగిన తరువాత, పతకం సాధించిన తరువాత వారికి సహాయం చేస్తున్నారు. క్రీడాకారుడికి ముందునుంచే చేయూతనందిస్తే మరింత మెరుగైన ప్రతిభ సాధించొచ్చు.
సాక్షి: భారత్ ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు చేయాల్సిన విధి ఏమిటి?
పూనమ్: ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుతోపాటు అకాడమీలను, క్లబ్‌లను అత్యధిక సంఖ్యలో ఏర్పాటు చేసి, క్రీడాకారులకు ఉన్నత శ్రేణి శిక్షణ అందించాలి. వారికి ప్రోత్సాహకాలను అందించి ఆదుకోవాలి.
సాక్షి: స్పోర్ట్స్ పాలసీపై మీ అభిప్రాయం?
పూనమ్:హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్‌హుడా దీన్ని ప్రవేశ పెట్టారు. వారిని అనుసరించి గతంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ దీన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. క్రీడాకారులకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
సాక్షి: ఇండియాలో ఏఏ రాష్ట్రాలు జూడో క్రీడలో రాణిస్తున్నాయి?
పూనమ్: దేశ వ్యాప్తంగా క్రీడ బాగా అభివృద్ధి సాధించింది. ముంబయ్, పూణే, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో అధిక సంఖ్యలో ఆడుతున్నారు.
సాక్షి: మీకు భారత ప్రభుత్వం అర్జున అవార్డును ఎప్పుడు అందించింది?
పూనమ్:భారత ప్రభుత్వం 1996లో అర్జున అవార్డు అందించింది. అదే ఏడాదిలో జూడలో అవార్డు సాధించిన ఏకైక మహిళగా కీర్తింపబడ్డా.
సాక్షి: ఆర్డీటీ గురించి మీ మాటల్లో...
పూనమ్:విదేశాల నుంచి వచ్చి ఇక్కడ వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఆర్డీటీ వల్ల నేడు ఈ ప్రాంతానికి వచ్చేందుకు వీలైంది. ఇక్కడ 5 క్రీడల్లో శిక్షణ అందించడం ద్వారా ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. దేశవ్యాప్తంగా క్రీడాభివృద్ధికి ఇలాంటి సంస్థలు సహకరించాలి.
Comments
Please login to add a commentAdd a comment