ఇకపై పేద విద్యార్థులకు వైద్య విద్య చదవటం కలగానే మిగిలిపోనుంది. కన్వీనర్ కోటా కింద మెడిసిన్ సీటు పొందినా ఏడాదికి లక్షలాది రూపాయలు చెల్లించాల్సి రావడంతో ఆ సీటులో చేరటం దుర్లభమే కానుంది.
సాక్షి, హైదరాబాద్: ఇకపై పేద విద్యార్థులకు వైద్య విద్య చదవటం కలగానే మిగిలిపోనుంది. కన్వీనర్ కోటా కింద మెడిసిన్ సీటు పొందినా ఏడాదికి లక్షలాది రూపాయలు చెల్లించాల్సి రావడంతో ఆ సీటులో చేరటం దుర్లభమే కానుంది. త్వరలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో ఏకీకృత ఫీజు (కామన్ ఫీజు) విధానం అమలు కానుండటంతో ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు వైద్య విద్యలో చేరే పరిస్థితి కనిపించటం లేదు. కేవలం ఎగువ మధ్య తరగతి, ధనవంతులకు మినహా సామాన్యులకు మెడిసిన్ చదువు ఎండమావే కానుంది. ఈ పరిస్థితుల్లో మెడిసిన్‌కు కామన్ ఫీజుపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇక వైద్య విద్యలో కేటగిరీలు ఉండవ్...
రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో సుమారు 3,650 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఇప్పటి వరకూ ఈ సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా, 10 శాతం బీ కేటగిరీ కోటా, 40 శాతం యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తున్నారు. కన్వీనర్ కోటా సీట్లకు ఏడాదికి రూ. 60 వేలు, బీ కేటగిరీ సీట్లకు ఏడాదికి రూ. 2.40 లక్షలు ఫీజుగా వసూలు చేస్తున్నారు. యాజమాన్య కోటా సీట్లకు మాత్రం నిబంధనల ప్రకారం ఏడాదికి రూ. 5.5 లక్షలు వసూలు చేయాలి. కానీ యాజమాన్యాలు ఒక్కో సీటును కోటి రూపాయల వరకూ బాహాటంగానే అమ్ముకుంటున్నాయి. ఇప్పుడు కొత్తగా కామన్ ఫీజు విధానం అమల్లోకి వస్తే ప్రైవేటు కళాశాలల్లో ఉన్న మొత్తం 3,650 సీట్లలో 15 శాతం అంటే 547 సీట్లను యాజమాన్యాలు ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) కోటా కింద భర్తీ చేసుకోగా.. మిగతా దాదాపు 3,100 సీట్లు కామన్ ఫీజులోనే ఉంటాయి. ఇకపై కన్వీనర్ కోటా, బీ కేటగిరీ, యాజమాన్య కోటా వంటి కేటగిరీలు ఏమీ ఉండవు. అంటే గతంలో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థి ఏడాదికి కేవలం రూ. 60 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉండగా.. కామన్ ఫీజు విధానంలో ఏడాదికి కనీసం రూ. 3.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
పెరిగిన ఫీజు రీయింబర్స్ చేయటం అనుమానమే...
ఎంబీబీఎస్ విద్యకు గతంలో కన్వీనర్ కోటా ఫీజు రూ. 60 వేలు ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భాగంగా ఆయా కళాశాలలకు చెల్లించేది. ఇప్పుడది కామన్ ఫీజుతో రూ. 3.5 లక్షలకు పెరిగిపోనుంది. అందులోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రూ. 3.5 లక్షల భారీ ఫీజును కొత్త ప్రభుత్వాలు రీయింబర్స్ చేస్తాయా అన్నది అనుమానంగా ఉంది. ఈ నేపధ్యంలో వైద్య విద్యకు కామన్ ఫీజు నిర్ణయంపై సర్వత్రా తీవ్ర ఆందోళన, వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఇప్పుడే ఇలావుంటే.. ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసు చేసిన రూ. 3 లక్షల నుంచి రూ.3.75 లక్షల కామన్ ఫీజు తమకు ఏ మాత్రం సరిపోదంటూ ప్రైవేటు వైద్య కళాశాలల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమకు కనీసం రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
దళిత, పేద విద్యార్థుల పరిస్థితి ఏమిటి?
వైద్య విద్యలో యాజమాన్య కోటా సీట్ల భర్తీ విధానాన్ని పారదర్శకంగా నిర్వహించాల్సింది పోయి, అన్ని వర్గాలకూ ఒకే ఫీజు విధించడం సరి కాదని జూనియర్ డాక్టర్ల సంఘం తప్పుపట్టింది. ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు ఉండటం వల్ల దళిత, పేద విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తోంది. త్వరలోనే దీనిపై కొత్త ప్రభుత్వాలకు వినతిపత్రం ఇవ్వనున్నట్టు జూడాల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు.