ఆన్‌లైన్‌లో పంచాయతీల పద్దు
Published Sun, Nov 10 2013 3:46 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలోని పంచాయతీలకు సంబంధించిన జనాభా, ఆదా యం, ఖర్చులు, ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. దీనికోసం క్లస్టర్ స్థాయిలో ఒక కంప్యూటర్‌ను ఏర్పాటు చేసి ఆపరేటర్‌ను నియమిస్తారు. క్లస్టర్ పరిధిలోని పంచాయతీల వివరాలను ఆ ఆపరేటర్ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. జిల్లాలోని 565 క్లస్టర్ల పరిధిలో 1104 పంచాయతీలు వున్నాయి. ఆన్‌లైన్ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తారు. అనంతరం జనాభా, ఆదాయం, ఇతర వివరాలను పరిశీలించి దశల వారీగా పంచాయతీల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తారు. సర్పంచ్ లు చేపడుతున్న పనులు, చేస్తున్న ఖర్చుల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఖర్చులు, పనుల్లో ఏ మాత్రం తేడా ఉన్నా సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దు చేస్తారు. పంచాయతీల కోసం 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులతోపాటు, వృత్తిపన్ను, తలసరి గ్రాంటు, సీనరేజ్ నిధులు జిల్లాకు ఇప్పటికే చేరాయి. 2011 జనాభా ఆధారంగా వీటిని పంచాయతీల ఖాతాలకు జమ చేయనున్నారు.
100 రోజులు పూర్తి..
ఎన్నికల్లో గెలిచిన పంచాయతీ సర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరించి శనివారం నాటికి 100 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు నిధులు లేకపోవడంతో వారెలాంటి అభివృ ద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. ఇప్పుడు నిధులు పెద్దఎత్తున రానుండటం తో పనులు చకచకా జరిగే అవకాశాలు ఉన్నాయి.
త్వరలో పన్నుపోటు..
మరోవైపు.. పంచాయతీల ఆదాయం పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం పన్నులను 30 నుంచి 40 శాతం వరకు పెంచాలని జిల్లా పంచాయతీ అధికారులకు సూచనలిచ్చింది. ఈ బాధ్యతను సర్పంచ్‌లకే అప్పగించాలని పేర్కొంది.
అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక
వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేశాక అన్ని పంచాయతీల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపొందించింది. ఇది తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. జనవరి నుంచి మన జిల్లాలో కూడా అమలు చేయనున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే చిన్నచిన్న పల్లెల్లో సైతం పట్టణ స్థాయి మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తా యి. అదే స్థాయిలో పన్నులు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
Advertisement
Advertisement