
వేధిస్తున్న పోస్టల్ ఆర్డర్ల కొరత
వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, సమాచారం కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకునే వారు పది రూపాయల పోస్టల్ ఆర్డర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు.
వేధిస్తున్న పోస్టల్ ఆర్డర్ల కొరత
చీరాల రూరల్,
వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, సమాచారం కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకునే వారు పది రూపాయల పోస్టల్ ఆర్డర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు.
పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఏ చిన్న సమాచారం తెలుసుకోవాలన్నా ముందుగా సమాచార హక్కు చట్టానికి సంబంధించిన దరఖాస్తుతో పాటు పోస్టాఫీసుల్లో దొరికే రూ.10 పోస్టల్ ఆర్డర్‌ను దరఖాస్తుతో పాటు జతచేసి పోస్టల్ ఆర్డర్ నంబర్‌ను కూడా దరఖాస్తుతో పాటు పొందుపరచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న కొలువుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. అయితే ఆయా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కూడా రూ.10 పోస్టల్ ఆర్డర్‌ను జతచేసి పంపాల్సి ఉంటుంది. కానీ చీరాలలోని హెడ్‌పోస్టాఫీసుతో పాటు పేరాల పోస్టాఫీసులలో పది రూపాయల పోస్టల్ ఆర్డర్లు మాత్రం దొరకడంలేదు. చేసేదేమి లేక అధిక కమీషన్ చెల్లించి బ్యాంకు డీడీలు తీసి దరఖాస్తులు పంపిచాల్సి వస్తోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధిక కమీషన్ చెల్లించాల్సి వస్తోంది..
సమాచార హక్కు చట్టం ద్వారా మనకు కావాల్సిన సమాచారం పొందాలంటే ఏ వ్యక్తి అయినా సరే పోస్టాఫీసులో దొరికే రూ.10 పోస్టల్ ఆర్డర్ తప్పని సరిగా జతచేయాల్సి ఉంటుంది. కానీ చీరాల హెడ్ పోస్టాఫీసులో మాత్రం రూ.10 పోస్టల్ ఆర్డర్ దొరకకపోవడంతో చేసేదేమిలేక రూ.2 పోస్టల్ ఆర్డర్లను 5 కొనుగోలు చేసి దరఖాస్తు చేసుకుంటున్నారు. రూ.10 పోస్టల్ ఆర్డర్‌పై అభ్యర్థులు పోస్టాఫీసులో ఒక్క రూపాయి కమీషన్ చెల్లిస్తే సరిపోతుంది. కానీ రెండు రూపాయల పోస్టల్ ఆర్డర్లు ఐదు తీసుకోవడం వల్ల ఒక్కొక్క దానిపై రూపాయి కమీషన్ చొప్పున రూ.5 పోస్టాఫీసులో చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐదు రూపాయలు అదనంగా పోస్టాఫీసులో చెల్లించాల్సి వస్తోంది.
చిల్లర దుకాణాల్లో..
పోస్టాఫీసుల్లో దొరకని రూ.10 పోస్టల్ ఆర్డర్లు మాత్రం చిల్లర దుకాణాలలో ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతున్నాయి. అయితే దుకాణదారులు మాత్రం అధిక ధరలకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పోస్టాఫీసుల్లో దొరకని పది రూపాయల పోస్టల్ ఆర్డర్లు చిల్లర దుకాణాలలో దొరుకుతుండడంతో ప్రజలు పోస్టల్ శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చీరాల హెడ్ పోస్టాఫీసు పోస్టు మాస్టర్ టి. శివరాంప్రసాద్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా రూ.10 పోస్టల్ ఆర్డర్లు అయిపోయిన మాట వాస్తవమేన్నారు. అయితే గత నెల 4వ తేదీ, ఈ నెల 7వ తేదీన సర్కిల్ స్టోర్స్ డిపో హైదరాబాద్ వారికి ఇండెంట్ పెట్టామన్నారు. అయితే అక్కడ కూడా పోస్టల్ ఆర్డర్లు అయిపోయాయనే సమాధానం వచ్చిందని ఆయన చెబుతున్నారు.