
మళ్లీ శవ పరీక్ష ఒక్కరికే
- ‘శేషాచలం’ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు ఉత్తర్వులు జారీ
- శశికుమార్ మృతదేహానికి మాత్రమే రీ పోస్టుమార్టం
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఇంకా మార్చురీలోనే ఉన్న ఐదుగురి కూలీల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలిచ్చేందుకు ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. దీనిపై మునియమ్మాళ్ అనే మహిళ ఒక్కరు మాత్రమే హైకోర్టును ఆశ్రయించినందున కేవలం ఆమె భర్త శశికుమార్ మృతదేహానికి మాత్రమే రీ పోస్టుమార్టం చేసేలా గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం తక్షణమే నిపుణులైన డాక్టర్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి డెరైక్టర్‌ను ఆదేశించింది. వైద్య బృందాన్ని సొంత ఖర్చులతో మృతదేహాలున్న తిరువన్నామలై జిల్లాలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వైద్య బృందం భద్రత కోసం అన్ని చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. రీ పోస్టుమార్టం జరిగే ఆసుపత్రి చుట్టుపక్కల ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు జరగకుండా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది.
డాక్టర్లు మినహా మరే వ్యక్తిని ఆసుపత్రి ప్రాంగణంలోకి సైతం అనుమతించరాదని తేల్చి చెప్పింది. వైద్య బృందం నివేదికను ఒక కాపీగా రూపొందించి సీల్డ్ కవర్‌లో తమకు సమర్పించాలని అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌కు స్పష్టం చేసింది. నివేదికను దర్యాప్తు అధికారితో సహా ఏ ఒక్కరూ చూడరాదని పేర్కొంది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన 20 మంది కూలీలకు నిర్వహించిన పోస్టుమార్టం నివేదికను సమర్పించాలని అదనపు ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కూలీలను పోలీసులు అతి సమీపం నుంచి కాల్చి చంపి ఎర్రచందనం కూలీలుగా, స్మగ్లర్లుగా చిత్రీకరిస్తున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పౌర హక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. శశికుమార్ భార్య మునియమ్మాళ్‌ను రెండో పిటిషనర్‌గా చేరుస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చిన విషయం విదితమే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దాన్ని గురువారం మరోసారి విచారించింది.
ఇంత ఆలస్యమెందుకు...?
విచారణ ప్రారంభం కాగానే అదనపు ఏజీ డి.శ్రీనివాస్‌ను పోస్టుమార్టం, ఇంక్వెస్ట్ నివేదికలపై ధర్మాసనం ఆరా తీసింది. ఇంక్వెస్ట్ నివేదిక సిద్ధమని, 20వ తేదీ కల్లా పోస్టుమార్టం నివేదిక తయారవుతుందని ఏజీ నివేదించారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘనాథ్ ప్రస్తావించిన అంశాలతో కోర్టు ఏకీభవిస్తూ కాల్పుల కేసులో పోస్టుమార్టం ఆలస్యం తగదని వ్యాఖ్యానించింది.