- వైభవంగా తిరునాళ్లు
- కనువిందుచేసిన పులిగుంటీశ్వరుడు
- ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
పెనుమూరు: సంక్రాంతి వేడుక ల్లో భాగంగా ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన పులిగుండు తిరునాళ్లు శనివారం వైభవంగా జరి గాయి. జిల్లా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తిరునాళ్లకు విచ్చేసి పులిగుంటీశ్వరున్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పులిగుండు పరిస ర ప్రాంతం వేలాది మంది భక్తులతో పోటెత్తింది. పులిగుంటీశ్వరస్వామికి ఏర్పా టు చేసిన పుష్పాలంకరణ భక్తులను పరవశింప జేసింది.
భక్తులు ఉత్సాహంతో పులిగుండు ఎక్కి అక్కడ ఉన్న దేవతా మూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పులిగుండు పరిసర గ్రామాల ప్రజలు స్వామికి పొంగళ్లు పెట్టి నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ధ్వజస్తంభం ముందు కొబ్బరికాయలు కొట్టి స్వామికి కర్పూర హారతులు పట్టారు. దేవస్థానంవారు పులిగుంటీశ్వర స్వామిని శేష వాహనంపై ప్రతిష్ఠించి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.
అనంతరం పులిగుండు వద్ద నుంచి గుంటిపల్లె రోడ్డు, కనికాపురం రోడ్డు, కొత్తరోడ్డు, ఠాణావేణు గోపాల పురం, సీఎస్ అగ్రహారం మీదుగా స్వామిని ఊరేగించారు. తిరునాళ్లలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పెనుమూరు ఎస్‌ఐ ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. పులిగుండు ఎక్కే మెట్లదారి వద్ద భక్తుల తోపులాటలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసారు. మెట్లదారిలో అక్కడక్కడా భక్తుల సౌకర్యార్థం చలివేంద్రాలు ఏర్పాటు చేసారు. పులిగుండు వద్ద పెనుమూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
పులిగుండు వద్ద ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే హరికథా కాలక్షేపం ఏర్పాటు చేసారు. వివిధ బృందాల చెక్క భజనలు, కోలాటాలు, నృత్యాలు ఆకట్టుకున్నారుు. ముగ్గుల పోటీలు, క్రికెట్, కబడ్డీ, వాలిబాల్, బాల్‌బ్యాడ్మింటన్, కుంటి ఆట, టెన్నికాయిడ్, పరుగు పందెం, మ్యూజికల్ చైర్స్, పొటాటో గ్యాదరింగ్, సూదికి దారం, కోలాటాలు, గొబ్బెమ్మ పాటలు, సైక్లింగ్ వంటి పోటీలు నిర్వహించి విజేతలకు విలువైన బహుమతులు అందించారు. రాత్రి 7 గంటలకు తిరుపతి అనంత్ సప్తస్వర ఆర్కెస్ట్రా వారిచే ఏర్పాటు చేసిన పాట కచేరి కార్యక్రమం అలరించింది.