కడు పేదరికంతో మా అన్న, మా అక్క చదువుకోలేదు. పూట కూడా గడవని పరిస్థితి. మేము పేదరికంతో మగ్గుతుండటంతో బంధువులెవ్వరూ కూడా మా కుటుంబాన్ని దగ్గరకు రానీలేదు ప్రస్తుతం నేనొక్కడినే చదువుకుంటున్నా అందుకు సహాయం కావాలి. - రమేష్ గౌడ్ అనే విద్యార్థి ఆవేదన.
నాకు అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి ఎవ్వరూ లేరు. నన్ను ప్రస్తుతం మా పెద్దనాన్న చదివిస్తున్నాడు. మున్ముందు నేను వారికి భారం కాకుండా ఉండాలంటే ప్రభుత్వమే చదివించాలి.
- కె.చిరంజీవి అనే విద్యార్థి దీనగాథ..
స్వయంగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి ఎదుట వారు తమ గోడు వెల్లబోసుకున్నారు. దీంతో స్పందించిన సీఎం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీకి ఏడాది దాటింది. నేటికీ కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో విద్యాభివృద్ధి ఆశించిన స్థాయిలో సాగడంలేదు. అక్షరాస్యత అంతంత మాత్రంగానే ఉంటోంది.
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: అక్షరాస్యతలో మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం అట్టడుగు స్థానంలో ఉంది. ఇక్కడ పురుషులు 44.05 శాతం, మహిళలు 25.13 శాతం అక్షరాస్యులుగా ఉన్నారు. మొత్త అక్షరాస్యత శాతం 34.45 మాత్రమే ఉంది. ఆ తర్వాత ధరూర్ మండలంల40.29, మల్దకల్ మండలం 41.99 శాతంతో ఉన్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మహబూబ్‌నగర్ జిల్లా అత్యంత సమీపంలో ఉంది. అయినా అక్షరాస్యతలో మాత్రం పూర్తిగా వెనుకబడి ఉంది. అందుకు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఈ జిల్లాకు విద్యకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి జిల్లాకు వచ్చిన ప్రతి సారీ ప్రకటించారు. అయితే ఆ ప్యాకేజీకి ఊసే లేకుండా పోయింది. రాష్ట్ర విభజన తదితర కారణాలతో జిల్లాపై సీఎం ప్రత్యేక దృష్టి సారించకపోయారు.
ఇదీ హమీ..
ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా 2012 సెప్టెంబర్ 14వ తేదీన గద్వాలలోని ప్రభుత్వ హాస్టల్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఒక్కో విద్యార్థి ఒక్కో బాధ వెలబుచ్చుతూ కన్నీళ్లు పెట్టి ఆవేదనను వ్యక్తం చేశారు. ‘ఒక ముఖ్యమంత్రి మీ వద్దకే వచ్చి మీ హాస్టల్‌లోనే బస చేస్తున్నారు.. అన్ని విధాలా మీరు అదృష్టవంతులే’’ అని ఈ సందర్భంగా సీఎం అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ అక్షరాస్యతలో వెనుకబాటుకు గల కారణాలను గుర్తించాను.
కరువు పరిస్థితులతో పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నందున చిన్న పిల్లలు కూడా వారి వెంట వెళ్తున్నందున చాలా మంది చదువుకోలేక పోతున్నారు. అందుకోసమే ఎవ్వరూ ఊహించని విధంగా విద్య కోసం జిల్లాకు స్పెషల్ ప్యాకేజీ మంజూరు చేస్తా. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులతో నివేదికలు తెప్పించుకొని మొదటి ప్రాధాన్యంగా గుర్తించి అవసరం వున్న ప్రతి చోట అదనంగా హాస్టళ్లు, స్కూళ్లు, కళాశాలలు ఇలా అన్నీ మంజూరు చేస్తాను’’ అని హామీ ఇచ్చారు. అలాగే అక్షరాస్యతలో వూర్తిగా వెనుకబడిన గట్టు మండలానికి స్పెషల్ స్కూల్ మంజూరు చేస్తున్నట్లు సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు.
హామీ ఇచ్చి ఏడాదైనా స్పెషల్ స్కూల్ నిర్మాణానికి సంబందించిన ప్రతిపాదనలు తెరపైకి రాలేదు. ప్యాకేజీ గురించి అతీగతీ లేకపోవడంతో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఎవ్వరికి వారు ఆయా నియోజకవర్గాల్లో కళాశాలు, హాస్టళ్లు మంజూరు చేయించుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా జిల్లాలో అక్షరాస్యత పెంపొందించేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయించుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఒక్కటై ఒత్తిడి తీసుకరావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రసరించని అక్షర ‘కిరణ'o
Published Sat, Dec 21 2013 3:31 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement