మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మహబూబ్‌నగర్ జిల్లా దగ్గరగా ఉన్నా అన్ని రంగాల్లో వెనకబడిపోయింది. ముఖ్యంగా అక్షరాస్యత విషయానికొస్తే జిల్లాలో నెలకొన్న పరిస్థితులను చూసి విద్య కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు వచ్చిన ప్రతిసారీ చెబుతున్న విషయం తెలిసిందే. గ్రామీణుల ఇబ్బందులు, వైద్యం, తాగునీరు తదితర వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు.
వీటిలో కొన్ని సమస్యలైనా తీర్చాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఎం.గిరిజా శంకర్ ఎంతో ఉత్సాహంతో పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నా.. ఆయన ఆలోచనలకు అనుకున్న మేరకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం లభించడం లేదు. కలెక్టర్ వంద రోజుల ప్రణాళిక పేరుతో ఒక్కోశాఖ అధికారి నుంచి 100 రోజుల్లో ఏయే పనులు పూర్తిచేస్తారు.. ఎలాంటి ఫలితాలు సాధించబోతున్నారనే విషయమై గతేడాది అక్టోబర్‌లో శాఖల వారీగా అధికారులతో లిఖితపూర్వకంగా తీసుకుని వాటిని జనవరి లోపు పూర్తిచేయాలని కోరారు.
ఈ విషయమై అప్పుడప్పుడు కలెక్టర్ సమీక్షలు నిర్వహించినా అనుకున్న ఫలితాలు రావడం లేదు. లిఖితపూర్వంగా కలెక్టర్‌కు ఇచ్చిన అధికారుల్లో చాలా మంది 10 శాతం పనులు కూడా పూర్తిచేయకపోవడంతో చేసేదేమీలేక వారిగురించి ప్రస్తావించడమే మానేశారు. 9 నెలల తర్వాత తిరిగి ఆ విధమైన ఆలోచన రావడంతో గతనెలలో కలెక్టర్ మరోసారి 100 రోజుల ప్రణాళికను అధికారులతో తీసుకున్నారు. ఇక ప్రభుత్వ హాస్టళ్లలో ప్రతినెలా నిర్ణయించిన తేదీన జిల్లా స్థాయి అధికారులు ఒక రోజు నిద్ర చేయాలని కలెక్టర్ నిర్ణయించినా అధికారులు హాస్టళ్లలో నిద్ర చేసేందుకు కొంతమంది ఉత్సాహం చూపకపోవడంతో మూడు నెలలుగా ఆ ప్రక్రియ కూడా ఆగిపోయింది. ‘పల్లె వికాసం’ పేరుతో ప్రతి శుక్రవారం మండల స్థాయి అధికారులు ఒక గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటిని సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించడం, ఆర్థిక పరమైన అంశాలు ఉన్నవి నివేదికలు ఇవ్వడంతో పాటు గ్రామంలో ఉన్న హాస్టళ్లు, పాఠశాలలను తనిఖీలు చేయాలని కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని నెలల పాటు ఈ కార్యక్రమం బాగా నిర్వహించినా.. గ్రామాల్లో గుర్తించిన సమస్యలకు నిధుల కొరత ఏర్పడుతుందని కొందరు గ్రామాలకు వెళ్లడమే మానేశారు. దీంతో ఈ కార్యక్రమానికి తాత్కాలికంగా దాదాపు ఆరునెలల పాటు బ్రేక్ పడినా వారం కిందట తిరిగి ‘పల్లె వికాసం’ కార్యక్రమం మొదలు పెట్టారు.
ఎక్కడి సమస్యలు అక్కడే!
సమస్యలు విన్నవించుకునేందుకు జిల్లా కేంద్రానికి రావడం వ్యయంతో కూడుకున్న పనిగా భావించి ఇక నుంచి సుదూర ప్రాంతాలకు చెందిన వారు ఫోన్ ద్వారా సమాచారమిస్తే ఆ సమస్యను వారం లోపు పరిష్కరిస్తామని ‘పరిష్కారం’ అనే కార్యక్రమాన్ని కలెక్టర్ కొత్తగా అమలుచేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు దాదాపు 1100 ఫిర్యాదులు ఫోన్ కాల్స్ ద్వారా రాగా, వాటిలో 464 పరిష్కరించారు. మిగిలిన వాటి పరిష్కారం కోసం అధికారులు చొరవచూపడం లేదు.
ముఖ్యమంత్రి పేషీ నుంచి వచ్చినా ఫిర్యాదుల గురించి ఇక పట్టించుకునే వారే లేకుండాపోయారు. 968 ఫిర్యాదులకు లేఖలు రాగా వీటిలో 850 విన్నపాల గురించి నెలలు గడుస్తున్నా స్పందించేవారే కరువయ్యారు. ఇలా ప్రతి కార్యక్రమానికి అడ్డంకులు ఎదురవుతుండటంతో కిందిస్థాయి అధికారులపై కలెక్టర్ గట్టిగా మందలిస్తున్నా.. వారిలో మార్పు రాకపోవడంతో కలెక్టర్ తానే మారే స్థితికివచ్చారు.
కలెక్టర్ జిల్లాలో బాధ్యతలు చేపట్టిన రోజే ‘దూకుడు’ పెంచి కలెక్టర్ పవర్ అంటే ఏంటో అధికారులు, కిందిస్థాయి అధికారులకు రుచి చూపారు. ఒకదశలో ‘నేనింతే... మారాల్సిందే మీరే’నని కరాఖండిగా చెప్పిన కలెక్టర్ గిరిజా శంకర్ రానురాను ‘మీరింతే.. నేనే మారుతా’ అనే పరిస్థితికి వచ్చారు. వీటికి కారణం జిల్లా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఏదేమైనా కలెక్టర్ జిల్లా ప్రజల కోసం కష్టపడుతుంటే ఆయన స్పీడుకు బ్రేకులు వేయడం వల్ల జిల్లా ప్రజలు నష్టపోతున్నారనేది ఎవ్వరూ గ్రహించలేకపోతున్నారు.
దూకుడుకు బ్రేక్!
Published Fri, Oct 18 2013 4:26 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement