వేసవి రాకముందే ప్రస్తుతం 8 నుంచి 12 గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరెంట్.. కట్.. కట్ !
Published Fri, Feb 7 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
సాక్షి, నరసరావుపేట: వేసవి రాకముందే ప్రస్తుతం 8 నుంచి 12 గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌పై ఆధారపడి ఉపాధి పొందే వేలాది మంది రోడ్డున పడాల్సిన పరిస్థితులు దాపురించాయి. మున్సిపాల్టీ పరిధిలో 6 నుంచి 8 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా పది నుంచి 12 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఫొటోస్టాట్ మెషిన్లు, పౌండ్రిలు, జ్యూస్‌స్టాల్స్, కంప్యూటర్ సెంటర్లు, ఫొటో స్టూడియోలు, ఇంటర్నెట్ సెంటర్లు, పిండిమరలు వంటి చిరువ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్న వారిని కరెంటు కోతలు తీవ్ర నష్టాలపాల్జేస్తున్నాయి.
ఉదయం 8 గంటలకు కరెంట్ తీస్తే 10 గంటలకు కూడా వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఒకవేళ వెంటనే ఇచ్చినా మళ్లీ ఇష్టమొచ్చినట్లు కరెంటు కోత విధిస్తున్నారు. చలికాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక వేసవిలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తలచు కుంటేనే భయమేస్తుందని పలువురు వాపోతున్నారు. ఆ గ్రామాల్లో ఉపాధి ప్రశ్నార్థకం.. నరసరావుపేట మండలం చిన్నతురకపాలెం, యల్లమంద గ్రామాల్లో విద్యుత్ మిషన్ల ద్వారా పరదాలు కుట్టి జీవనోపాధి పొందు తున్న 400 కుటుంబాల ప్రస్తుతం పనులు లేక అలమటిస్తున్నారు. 15 రోజులుగా రోజుకు 12 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. పరదాలు కుట్టాలంటే విధిగా కరెంటు తొక్కుడు మిషన్ అవసరం వుంది. పగలంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు.
ఇంకా, పౌండ్రి, సర్ఫ్ తయారీ, సిమెంటు బ్రిక్స్ తయారీ తదితర యూనిట్లలో పనిచేసే వారు కూడా విద్యుత్ కోతకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
రైతుల పరిస్థితి మరింత దారుణం.. కరెంటు కోతలు రైతులను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. భారీ వర్షాలకు ఖరీఫ్‌లో పంటలన్నీ నీటిపాల య్యాయి. ఆ నష్టాలను పూడ్చుకుందామని రబీ సాగుకు ఉపక్రమించిన రైతులను కోతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏడుగంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని గాలికొదిలేసి రెండు మూడు గంటలపాటు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తుంది. ప్రస్తుతం ఇస్తున్న ఆ రెండు మూడు గంటలు విద్యుత్ సరఫరా సైతం వేళాపాళా లేకుండా ఇస్తుండటంతో పంటలు తడవక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
Advertisement
Advertisement