మళ్లీ చీకటి రోజులు
మళ్లీ చీకటి రోజులు
Published Tue, Oct 22 2013 2:01 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
రాష్ట్రంలో పరిశ్రమలకు మళ్లీ విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. కరెంటు కోతలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించి పట్టుమని నెల రోజులు కాకముందే మళ్లీ విద్యుత్ కటకటలు మొదలయ్యాయి. సోమవారం నుంచే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అధిక విద్యుత్ వినియోగవేళల్లో (పీక్ అవర్స్) పరిశ్రమలకు కోతలు అమలు చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో కేవలం లైటింగ్ లోడుకు (లైట్లు వెలిగించడానికి) మాత్రమే అనుమతించారు. ఈ విద్యుత్ కోతలు ఎప్పటివరకు కొనసాగుతాయనేది చెప్పలేమని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇప్పటికే గృహ అవసరాలకు విద్యుత్ కోతలు అమలవుతున్న సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజుకు 3 గంటల చొప్పున విద్యుత్ కోతలు విధిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో 5 గంటలు, మండల కేంద్రాలు, మునిసిపాలిటీల్లో 7 గంటలు, గ్రామాల్లో ఏకంగా 12 గంటల చొప్పున విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. వ్యవసాయానికీ రోజుకు 2-3 గంటలకు మించి విద్యుత్ సరఫరా కావడం లేదు.
బొగ్గు ఎఫెక్ట్...
ఇటీవల కురిసిన భారీవర్షాల దెబ్బకు ఒడిశాలోని తాల్చేరు గనిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోని ఎన్‌టీపీసీ రామగుండం, సింహాద్రి యూనిట్లకు బొగ్గు సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా ఎన్‌టీపీసీ యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. విశాఖ సమీపంలోని ఎన్‌టీపీసీ సింహాద్రిలో మొదటి యూనిట్‌లో బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రెండో యూనిట్‌లో సాంకేతిక సమస్యల వల్ల ఉత్పత్తి జరగడం లేదు. మూడు, నాలుగు యూనిట్లలో కూడా బొగ్గు ఇబ్బందులతో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగడం లేదు. ఎన్‌టీపీసీకి చెందిన రామగుండంలోని యూనిట్లలోనూ ఇదే పరిస్థితి. మొత్తం మీద సుమారు 1,200 మెగావాట్ల విద్యుత్ తగ్గిపోయింది. మరోవైపు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిస్థాయిలో చేయడం లేదు. రానున్న రోజులకు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేవలం కొద్ది సమయం మాత్రమే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని జెన్‌కో వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఎన్‌టీపీసీ యూనిట్లకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకోవడం ద్వారా విద్యుత్ కోతలను తగ్గించే అవకాశమున్నా ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
కోతలతో వరుస మూతలు...
పరిశ్రమలకు విద్యుత్ కోతల వల్ల రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2011 అక్టోబరులో మొదలైన విద్యుత్ కోతలు మొన్నటి జూలై వరకూ కొనసాగాయి. దాని ఫలితంగా చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కాసింత ఊపిరిపీల్చుకున్న పరిశ్రమలకు మళ్లీ విద్యుత్ కోతలు ప్రారంభమవటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల వేలాది పరిశ్రమలు మూతపడుతున్నాయని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక తేటతెల్లం చేసింది. 2013 ఏప్రిల్ 1 నుంచి 2013 జూన్ 30 వరకు ముగిసిన మొదటి త్రైమాసికంలో రాష్ట్రవ్యాప్తంగా 6,499 పరిశ్రమలు మూతపడ్డాయి. 2013 మార్చి 31 నాటికి రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంఖ్య 12,982 ఉండగా.. కేవలం మూడు నెలల కాలంలో అంటే 30 జూన్ 2013 నాటికి ఈ సంఖ్య 19,481కు చేరుకుంది. అంటే రోజుకు 72 యూనిట్ల చొప్పున మూతపడుతున్నాయన్నమాట. అదేవిధంగా ఈ పరిశ్రమలకు వివిధ బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ. 833 కోట్ల నుంచి రూ. 1,256 కోట్లకు పెరిగింది. అంటే రూ. 423 కోట్ల మేర రుణాలు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా మిగిలిపోయాయన్నమాట.
Advertisement