విద్యుత్ సమస్యకు సోలార్‌తో చెక్
రూఫ్‌టాప్ పథకంలో సోలార్ పరికరాలు మంజూరు
మార్చి వరకు 50 శాతం రాయితీ
శావల్యాపురం : సౌరశక్తి ద్వారా విద్యుత్ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం రూఫ్ టాప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. సోలార్ విధానంతో ఇళ్లలో విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. దరఖాస్తు చేసుకున్న ఎవ్వరికైనా నెల రోజుల వ్యవధిలో 5 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ పలకలు మంజూరు చేస్తారు. శ్లాబు (పక్కా) ఇళ్లు ఉన్న లబ్ధిదారులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. శ్లాబు పైభాగాన 100 అడుగుల స్థలంలో నీడ పడని ప్రదేశం ఉండాలి. రూఫ్ టాప్ సోలార్ విధానం ద్వారా 10.25 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గృహాల్లో 5 కిలోవాట్స్ వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యే విధంగా పరికరాలు మంజూరు చేస్తారు.
పగలంతా తయారైన విద్యుత్ ఉత్పత్తి గ్రీడ్ విధానం ద్వారా స్థానిక 33-11 కేవీ ఉప విద్యుత్ స్టేషనుకు సరఫరా అవుతుంది. రాత్రి సమయాల్లో విద్యుత్ కోతలతో పనిలేకుండా సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను సరఫరా చేస్తారు. సోలార్ పథకం పాతికేళ్ల పాటు పని చేస్తుంది. ఐదేళ్లకు సోలార్ పరికరాలు అమర్చే వారు వారెంట్ ఇస్తారు. జిల్లా నెట్‌క్యాప్ మేనేజరు జి.హరినాథ్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో ఈ పథకానికి సంబంధించి 150 దరఖాస్తులు అందాయన్నారు. గుంటూరు, చిలుకలూరిపేట, తెనాలి ప్రాంతాల్లో ఇప్పటికే 20 యూనిట్లు అమర్చినట్లు చెప్పారు. కేంద్రం 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం రాయితీ ఇచ్చిందన్నారు. మార్చి వరకు మాత్రమే 50 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు.