కడుపు నింపే ‘ఉపాధి హామీ’ కలేనా..!
- జాబ్‌కార్డులున్న కుటుంబాలు 54 లక్షలు.. సగం మందికీ ఉపాధి లేదు
- 100 రోజుల పనులకుగానూ ఇప్పటికి కల్పించింది 38 రోజులే
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంత నిరుపేద కూలీల కడుపు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కలగానే మిగిలిపోతోంది. విద్యుత్ సమస్య కారణంగా వరి వేయరాదని ప్రభుత్వం ప్రచారం చేయడంతో వ్యవసాయ పనులు లేక ఇప్పటికే ఇబ్బంది పడుతున్న కూలీలకు గ్రామీణాభివృద్ధిశాఖ కూడా ఉపాధి హామీ పనులు ఇవ్వట్లేదు. కూలీలు ఎప్పుడు పని అడిగినా కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశమైనా అధికారులు ఏటా మూడో త్రైమాసికంలో కూలీలకు పని కల్పించట్లేదు.
దీంతో జాబ్‌కార్డు తీసుకున్న ప్రతీ కుటుంబానికి ఏటా 100 రోజుల పని కల్పించాల్సి ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం సరాసరి 38 రోజుల పనిదినాలనే అధికారులు కల్పించారు. పనులను ముందుగా గుర్తించకపోవడం, గుర్తించిన పనులు చేపట్టడానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయకపోవడంతో ఉపాధి హామీ పనులు ముందుకు సాగట్లేదు. పనికోసం డిమాండ్ చేసే కూలీలకు గ్రామాల్లో క్షేత్ర సహాయకులు, మండలస్థాయి అధికారులు సరైన సమాధానం చెప్పకుండా పనులు లేవంటూ పంపించేస్తున్నారు.
ఉపాధి హామీ పనుల్లో ప్రస్తుతం నర్సరీ, మరుగుదొడ్ల నిర్మాణ పనులున్నా... అవి చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో డిమాండ్ మేరకు పనులు కల్పించలేక అధికారులు విఫలం అవుతున్నారు. ఈ ఏడాదిలో 10 లక్షల వరకు వివిధ రకాల పనులు చేపట్టినట్లు రికార్డుల్లో ఉన్నా 2.82 లక్షల పనులు పూర్తి చేసినట్లే చెబుతున్నారు. ఒక పంచాయతీ పరిధిలోని చిన్నచిన్న అనుబంధ గ్రామాలకు క్షేత్ర సహాయకులు లేకపోవడంతో ఆ గ్రామాల్లోని వారికి ఉపాధి హామీ చూపించేవారు లేకుండాపోయారు. సాధారణంగా క్షేత్ర సహాయకులు ఏ ప్రాంతంలో పనిచేయాలో చూపించడంతోపాటు కొలతలు ఇస్తే తప్ప.. కూలీలు పనిచేయడానికి వీల్లేని పరిస్థితి.
తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం రూ. 1,568 కోట్ల మేరకు పనులు జరిగినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నా పనికి అవసరమైన మెటీరియల్‌తోపాటు కూలీలకు ఇప్పటి వరకు మొత్తం రూ. 1,028 కోట్లు చెల్లించినట్లు వివరించారు. జాబ్‌కార్డులున్న 54 లక్షల కుటుంబాల్లో కేవలం 1.23 లక్షల కుటుంబాలే 100 రోజుల పని పూర్తి చేయడం గమనార్హం.
దీనికితోడు ఏటా ఉపాధి హామీ పనుల్లో వేతనాలను పెంచుతున్నా (ప్రస్తుతం రూ. 169) కూలీలకు లభిస్తున్నది సరాసరి రూ.105 దాటట్లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం పనులు తక్షణం మొదలైనా ఎంతోకొంత ఉపాధి లభించే అవ కాశం ఉన్నా టెండర్లు పిలవడంలోనే పుణ్యకాలం గడిచిపోతోంది. ఉపాధి హామీ తీరుపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలో కూలీలు ఏమన్నారంటే...
8 నెలల్లో 3 రోజులే పని
ఉపాధి హామీ కింద గత 8 నెలల్లో నాకు 3 రోజులే పనిచూపారు. పని అడిగితే, లేదంటున్నారు. వ్యవసాయ పనులకు వెళ్దామన్నా, వర్షాలు లేక వరినాట్లు లేవు. పనులు దొరకక వారంలో 3 రోజులు ఇంటి వద్దే ఉంటూ పస్తులుండాల్సి వస్తోంది.
- బోదుల యాదమ్మ, చౌటుప్పల్
పని దినాలు పెంచాలి...
అర్హులైన కూలీలందరికీ పని కల్పించి పని దినాలను పెంచాలి. రూ.115కి మించి కూలీ రావట్లే. వంద రోజుల పని దినాల పేరుతో మాకు పనిని దూరం చేసి పస్తులుండే పరిస్థితిని తీసుకురావొద్దు.
- అచ్చిన్న సత్తయ్య, మగ్ధుంపూర్, మండలం నంగునూరు
పనుల్లేవు
ఒక్కరోజు పనికి పోతే రెండు రోజులు ఇంటికాడ ఉంటన్నం. పండుగకు ముందు గ్రామంలోనే నర్సరీ పనులకు వెళ్లా. నాలుగు రోజులాయె పనులు లేవు. ఇంటికాడనే ఉంటన్నాం. ఎవుసం పనులూ దొరకట్లేదు. రోజూ పని ఉండేలా చూస్తే మంచిగుంటది.
- అనురాధ, ఈజీఎస్ కూలి, తిగుల్ గ్రామం
పనులు ప్రారంభించాలి
100 రోజుల పని కల్పిస్తామంటూ జాబ్‌కార్డులు ఇచ్చిన ప్రభుత్వం పనులు ప్రారంభించకుండా ఆలస్యం చేయడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. సర్కారు వెంటనే ఉపాధి పనులు ప్రారంభించి వలసలను ఆపాల్సిన అవసరముంది.
- జి.ఆంజనేయులు, ఉపాధి కూలి, బూరుగడ్డ, హుజూర్‌నగర్ మండలం