ముందే బాదుడు... | pre paid bills to be in power system! | Sakshi
Sakshi News home page

ముందే బాదుడు...

Published Mon, Sep 1 2014 1:19 AM | Last Updated on Thu, May 24 2018 1:29 PM

ముందే బాదుడు... - Sakshi

ముందే బాదుడు...

సాక్షి, హైదరాబాద్: ఇకపై వినియోగదారులు ముందుగానే కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటుంది! ఆ మొత్తానికి కరెంటును వాడుకున్న వెంటనే సదరు వినియోగదారుడి ఇంటికి సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ రీ-చార్జ్ చేసుకుంటేనే విద్యుత్ వెలుగులను పొందుతారు. ఇదే ప్రీ-పెయిడ్ విధానం. దీన్ని త్వరలో అమలు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు సిద్ధమవుతున్నాయి. ప్రీ-పెయిడ్ మీటర్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు.
 
 విద్యుత్ బకాయిలు కోట్లలో పేరుకుపోతుండటం, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, దొంగ కరెంటు వినియోగం.. తద్వారా విద్యుత్ సరఫరా, పంపిణీ(టీ అండ్ డీ) నష్టాలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రీ-పెయిడ్ మీటర్ల విధానాన్ని కేంద్రం తెరమీదకు తెచ్చింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శు(సీఎస్)లకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ప్రదీప్ కె. సిన్హా లేఖ రాశారు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపాలిటీలు, పంచాయతీల్లో అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం మిగిలిన వినియోగదారులకూ వర్తింపజేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్రీ పెయిడ్ ఫోన్ల తరహాలోనే.. ఈ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు పనిచేస్తాయి. ఒక్కో వినియోగదారుడికి ప్రీ పెయిడ్ సిమ్‌ను డిస్కంలు మంజూరు చేస్తాయి. ఈ సిమ్‌కు ప్రత్యేక నంబర్ ఉంటుంది.
 
 దీన్ని ముందుగా కావాల్సిన మొత్తంతో రీచార్జి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సిమ్‌ను మీటర్లో అమర్చిన వెంటనే కరెంటు సరఫరా అవుతుంది. ఈ సిమ్‌లో బ్యాలెన్స్ అయిపోగానే ఆటోమేటిక్‌గా కరెంటు సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ సిమ్‌లో రీచార్జి చేయించుకుంటేనే కరెంటు సరఫరా తిరిగి ప్రారంభమవుతుంది. అయితే, ఈ విధానం ద్వారా... నెలనెలా చాంతాడంత క్యూలో నిలబడి విద్యుత్ బిల్లు చెల్లించడం, గడువులోగా చెల్లించలేదనే కారణంగా కనెక్షన్లు తొలగించడం వంటి సమస్యల నుంచి వినియోగదారులకు ఊరట లభిస్తుంది. తమకూ బకాయిల భారం తప్పుతుందని విద్యుత్ పంపిణీ సంస్థలు అంటున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కలిపి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ. 1,300 కోట్ల మేరకు  విద్యుత్ చార్జీలను బకాయి పడిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. అయితే ఈ మీటర్ల కొనుగోలుకు అయ్యే వ్యయ భారాన్ని విద్యుత్ చార్జీల రూపంలో మళ్లీ వినియోగదారులపైనే మోపుతారని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం సాధారణ మీటర్లు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు చెల్లిస్తే లభిస్తున్నాయి. కానీ ప్రీ పెయిడ్ మీటర్లకు రూ. 5 వేల నుంచి రూ. 7 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం గృహ విద్యుత్ కనెక్షన్లే రెండు కోట్లకుపైగా ఉన్నాయి. ఒక్కో మీటరుకు సగటున రూ. 6 వేలు లెక్కించినా... రూ. 12 వేల కోట్లకుపైగా నిధులను మీటర్ల కొనుగోలుకు వెచ్చించాల్సి ఉంటుందని నిపుణుల అంచనా. దీంతో ఈ భారాన్ని చార్జీల పెంపుతో జనంపైనే వేయడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement