
అగ్నికీలలకు నిండు గర్భిణి బలి
మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు జడ్జి పల్లె మోహన్ కుమార్ ఇంట విషాదం అలముకుంది. మోహన్‌కుమార్ కుమార్తె పల్లె ప్రియాంక (25) బస్సు ప్రమాద ఘటనలో అగ్నికి ఆహుతయ్యారు. ఆమెకు రెండేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి అని తెలిసింది. దీపావళి పర్వదినానికి చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభ సమీపంలోని హెచ్‌ఎస్‌ఆర్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న పెద్దమ్మ ఇంటికి బయలుదేరింది. బయలుదేరే ముందు కూడా కుటుంబసభ్యులకు ఫోన్ చేసి హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పింది. ప్రియాంక బాచుపల్లిలోని వీజేఐఎం కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసి మొదట ఐడియాలో, ఆ తర్వాత బెంగళూరులోని టెస్కో కంపెనీలో ఉద్యోగం చేశారు.
భర్త కూడా టెస్కో కంపెనీలో టీం లీడర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి ఐబీపీఎస్ పరీక్షలకు ప్రిపేరవుతోంది. జడ్జి మోహన్‌కుమార్ కు ఆమె ఒక్కగానొక్క కుమార్తె అని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక భర్త విమానంలో హుటా హుటిన నగరానికి చేరుకున్నారు. ప్రియాంక మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బుధవారం సాయంత్రం చిక్కడపల్లిలోని హెచ్‌ఆర్‌ఎస్ అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చారు. పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు తరలివచ్చి ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.
తల్లిని చూసేందుకు వస్తూ..
అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని పరామర్శించేందుకు భర్త, కుమార్తెతో కలిసి నగరానికి బయల్దేరిన జబీన్ ఫాతిమా బుధవారం నాటి దుర్ఘటనలో సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో భర్త అజ్మతుల్లాతో పాటు కుమార్తె ఉజ్మా ఫాతిమాను కూడా అగ్నికీలలు పొట్టనపెట్టుకున్నాయి. పాతబస్తీ డబీర్‌పురా పత్తర్‌కా మకాన్ ప్రాంతానికి చెందిన బట్టల వ్యాపారి సయ్యద్ అస్లాముద్దీన్, ఖమర్ బేగం దంపతులు. వీరికి ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు సంతానం. మూడో కుమార్తె జబీన్ ఫాతిమా (28). ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం బెంగళూర్ గుర్ధల్లి ప్రాంతానికి చెందిన కారు పార్కింగ్ నిర్వాహకుడు అజ్మతుల్లా(36)తో వివాహం జరిగింది.
అజ్మతుల్లాకు నాంపల్లి రైల్వేస్టేషన్‌లో కారు పార్కింగ్ వ్యాపారం ఉంది. ఇక్కడి వ్యవహారాల్ని బంధువులకు అప్పగించాడు. అప్పుడప్పుడు నగరానికి వచ్చిపోతుంటాడు. ఈ దంపతుల కుమార్తె ఉజ్మాఫాతిమా(7). మానసిక వికలాంగురాలు. ఈమెకు బెంగళూరులోనే వైద్యం చేయిస్తున్నారు. జబీన్ ఫాతిమా తల్లి ఖమర్ బేగం గత కొంతకాలంగా హృద్రోగంతో బాధపడుతోంది. తల్లిని పరామర్శించేందుకు ఫాతిమా భర్త, కుమార్తెతో సహా మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి నగరానికి బయల్దేరింది. బుధవారం ఉదయం ఈ కుటుంబం అగ్నికీలలకు బలైంది.
మమ్మీ.. ఐయామ్ ది విన్నర్...
మచిలీపట్నం, న్యూస్‌లైన్: ‘‘మమ్మీ ఐయామ్ ది విన్నర్.. ఇంటర్వ్యూలో సెలెక్టయ్యాను.. అనుకున్న ఉద్యోగం సాధించాను.. మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఏడాదికి రూ. 7,50 లక్షల ప్యాకేజీ.. బయలుదేరుతున్నా, రేపు ఉదయానికి వచ్చేస్తా ’’ అంటూ అమ్మతో ఆనందంగా చెప్పిన మాటలే ఆఖరు మాటలయ్యాయి. మంచి ఉద్యోగం దొరికిందన్న ఆనందంలో ఉండగానే.. ఆ యువకుడిని మృత్యువు కబళించింది.
కృష్ణా జిల్లా బందరు వర్రెగూడెం వాసి తక్కెళ్ల సురేష్‌బాబు (27) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. బెంగళూరులోని హెచ్‌పీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం వెళ్లి, ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పద్మ, తులసీరావులకు చెప్పి ఆనందాన్ని పంచుకున్నాడు. మరో నాలుగురోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది కూడా. హైదరాబాద్‌లో పనులు పూర్తిచేసుకునేందుకు మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరాడు. బస్సు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
వెంటాడిన మృత్యువు..
సాక్షి, నరసరావుపేట/ నరసరావుపేట రూరల్, న్యూస్‌లైన్: నాడు మృత్యువుతో పోరాడి గెలిచిన ఆ దంపతులు.. నేడు అదే మృత్యువుకు తలవంచారు. గతంలో రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిద్దరూ ఈసారి మాత్రం విధిరాతను తప్పించుకోలేకపోయారు. పాలమూరు బస్సు ప్రమాదంలో గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన గాలి బాలసుందరరాజు(55), అతని భార్య మేరి విజయకుమారి(52) సజీవదహనమయ్యారు. వీరి కుమార్తె గాలి సౌమ్య బెంగళూరు ఎంఎస్ రామయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్కిటెక్ ఇంజనీరింగ్ చదువుతోంది. కుమార్తె చదువు కోసం వీరు మూడేళ్లుగా బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. బాలసుందరరాజు, విజయకుమారి ఇటీవల అనారోగ్యం పాలయ్యారు.
హైదరాబాద్‌లో వైద్య పరీక్షల నిమిత్తం వారిద్దరు మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి బస్సులో బయలుదేరారు. మరో గంటలో బస్సు హైదరాబాద్ చేరుకుంటుందనగా దుర్మరణం పాలయ్యారు. వీరిద్దరూ మరణించడంతో కుమార్తె సౌమ్య అనాథగా మారింది. ఈ ఘటనతో స్వగ్రామమైన రావిపాడులో విషాదఛాయలు అలముకున్నాయి. 1989లో బాలసుందరరాజు దంపతులు బంధువులతో కలసి తమిళనాడులోని వేళాంగిణి మాతను దర్శించుకొని తిరిగి వస్తుండగా నెల్లూరు వద్ద వీరి కారు ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో బాలసుందరరాజు దంపతులతో పాటు మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇది జరిగిన రెండు దశాబ్దాల తర్వాత బస్సు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబళించింది.
అమ్మా.. మంచి ఉద్యోగం వచ్చింది..
నర్సీపట్నం రూరల్ (విశాఖ జిల్లా), న్యూస్‌లైన్: ‘‘అమ్మా.. మంచి ఉద్యోగం వచ్చింది.. జాయిన్ అయ్యేందుకు వెళ్తున్నా’’ అని కుమారుడు చెప్పిన మాటలే ఆ తల్లికి చివరి పలుకులయ్యాయి. దసరా పండుగకు ఇంటికి వచ్చి సందడి చేసిన కొడుకు.. పది రోజుల తర్వాత తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మహ బూబ్‌నగర్ బస్సు ప్రమాదంలో విశాఖ జిల్లా నర్సీపట్నంలోని కొత్తవీధికి చెందిన ఆడారి రవి(27) అగ్నికి ఆహుతయ్యాడు. రవి మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయింది.
బెంగళూరులోని సీజీడీఎం సంస్థలో రవి రెండేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లోని వేరే కంపెనీలో ఉద్యోగం రావడంతో చేరేందుకు మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరాడు. మరో గంటలో హైదరాబాద్ చేరుకుంటాడనగా ఈ దుర్ఘటన జరిగింది. రవి చనిపోయాడన్న విషయం టీవీలో చూసిన అతని కుటుంబసభ్యులు దిగ్భ్రాంత్రికి గురయ్యారు. రవి తండ్రి కృష్ణ చింతపల్లిలోని జీసీసీలో అకౌంటెంట్. తల్లి చెల్లయ్యమ్మ గృహిణి. దసరాకు ఇంటికి వచ్చి పదిరోజుల క్రితమే బెంగళూరు వెళ్లాడని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని రవి సోదరుడు గణేష్ చెప్పాడు.
కడసారి చూపు కరువైంది...
పెగడపల్లి, న్యూస్‌లైన్: తమ కుమారుడు పండుగకు రెండు రోజుల ముందే ఇంటికి వస్తున్నాడని సంబరపడిన ఆ కుటుంబానికి తీరని విషాదమే మిగిలింది. మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థితిలో ఉంటాడనుకున్న కుమారుడు మరణించడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీట మునిగిపోయారు. బస్సు ప్రమాదంలో కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం నంచర్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అమరేందర్ (31) సజీవ దహనమయ్యాడు. విట్టు రాజేశం-కళావతిల కుమారుడు అమరేందర్. చిన్న కిరాణ దుకాణం నడుపుతూ రాజేశం కుమారుడిని ఉన్నత చదువులు చదివించారు.
అమరేందర్ ఎంసీఏ పూర్తి చేసి మూడేళ్ల కింద బెంగళూరులోని క్యాప్ జెమినీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. పండుగకని బెంగళూర్ నుంచి మంగళవారం రాత్రి బస్సులో బయలుదేరాడు. కానీ, తనవారిని చూసుకోకుండానే మృత్యువాత పడ్డాడు. అమరేందర్‌కు పెళ్లయి ఏడాది కూడా కాలేదు. ఆయన భార్య నర్మద ప్రస్తుతం గర్భంతో ఉంది. అమరేందర్ మరణాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కన్నీళ్లే మిగిలాయి...
కామారెడ్డి, న్యూస్‌లైన్: తన భర్త మరికొద్ది గంటల్లో వచ్చేస్తాడని ఎదురుచూసిన ఆ భార్యకు కన్నీళ్లే మిగిలాయి. కన్నకొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. మహబూబ్‌నగర్ బస్సు దుర్ఘటనలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన కుసుమ వేదపతి (27) దుర్మరణం పాలయ్యారు. రిటైర్డ్ ఉద్యోగి విఠల్-సుశీల దంపతుల కుమారుడు వేదపతి. బెంగళూరులోని డచ్ బ్యాం కులో ఉద్యోగం చేస్తున్న వేదపతి దీపావళి కోసం మంగళవారం రాత్రి బస్సులో బయలుదేరి, ప్రమాదంలో మరణించారు.
చానళ్లలో వస్తున్న ప్రమాద వార్తలు చూస్తూ.. మృతుల జాబితాలో కుమారుడి పేరు రావడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తల్లి సుశీల స్పృహ తప్పి పడిపోగా ఆస్పత్రికి తరలించారు. వేదపతికి వివాహం జరిగి ఏడాది కూడా కాలేదు. భార్య స్వర్ణలత కామారెడ్డిలో అత్తవారింట్లోనే ఉండి, ఎంబీఏ చదువుతోంది. కాలేజీ నుంచి వచ్చే సరికి తన భర్త వచ్చేస్తారనే ఆనందంలో ఉన్న ఆమె.. మరణవార్త తెలియడంతో హతాశురాలైపోయారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.
కబళించిన మృత్యుకౌగిలి..
రామచంద్రపురం, న్యూస్‌లైన్: బంధువుల ఇంట్లో వివాహం కోసం వస్తూ.. ఓ కుటుంబం మృత్యుకౌగిలిలోకి వెళ్లిపోయింది. మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. రామచంద్రపురం పట్టణానికి చెందిన పలుకూరి నాగవెంకటరాజేష్(31), ఆయన భార్య రమ్య (26), వారి కుమార్తె రితిమ(3) ఈ ప్రమాదంలో మృతి చెందారు. బెంగళూరులో సీసీఎస్ కంపెనీలో రాజేష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, రమ్య మరో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఇటీవలే ఉద్యోగంలో చేరారు.
బెంగళూరులోనే నివసిస్తున్న వీరు.. రమ్య మేనమామ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వస్తూ ప్రమాదానికి గురయ్యారు. రామచంద్రపురానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు బచ్చు వీరభద్రరావు, రత్నావతి దంపతుల కుమారుడైన రాజేష్‌ను.. అమ్మమ్మ పలుకూరి మంగరాజు దత్తత తీసుకున్నారు. ఎంసీఏ చదివిన రాజేష్‌కు కాకినాడకు చెందిన రమ్యతో 2009లో వివాహమైంది. చిన్నారితో సహా రాజేష్ దంపతులు దుర్మరణం చెందారన్న వార్తతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి.
పెళ్లి పత్రికలు పంచేందుకు వస్తూ...
రాంగోపాల్‌పేట్, న్యూస్‌లైన్: ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బంధువును పరామర్శించేందుకు బెంగళూరు నుంచి నగరానికి బయలుదేరిన అక్కా తమ్ముడు బస్సుప్రమాదంలో అగ్నికి బలయ్యారు. బెంగళూరుకు చెందిన అనిత(50), వెంకటేష్ (45) అక్కాతమ్ముళ్లు. అనిత కుమార్తె వివాహం వచ్చే నెలలో చేసేందుకు నిర్ణయించారు. వివాహ శుభలేఖలు అందించే కార్యక్రమంలో వీరు బిజీగా ఉన్నారు. నగరంలోని కోఠి ఇసామియాబజార్‌కు చెందిన హేమలతకు వీరు బంధువులు.
హేమలత గుండె జబ్బుతో బాధపడుతూ ఇటీవలే సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరామర్శించడంతో పాటు వారికి శుభలేఖను కూడా అందించాలనే ఉద్దేశంతో బెంగళూరు నుంచి నగరానికి మంగళవారం రాత్రి జబ్బార్ ట్రావెల్స్ బస్సులో బయల్దేరారు. మంగళవారం రాత్రి 11.30కు హేమలత కుమారుడు లలిత్‌కుమార్‌కు ఫోన్ చేశారు. తాము నేరుగా ఆస్పత్రికి వస్తామని తరువాత మిగతా కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఘోరప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వెంకటేష్ కర్నాటకలో చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు.
అమ్మను చూడడానికి వెళ్లి..
సాక్షి, బెంగళూరు: అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసి రావడానికి బయలుదేరిన మహిళ.. తన భర్తతో సహా మృత్యువుకు బలైంది. వారితో పాటు మరో చిన్నారి మైథిలి (8)ని మృత్యువు కబళించింది. బెంగళూరులోని జయనగర్‌కు చెందిన గిరిధర్(55) రామ్‌కో సంస్థలో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉండే వాసంతి తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో.. చూసిరావడానికి గిరిధర్, వాసంతి, మరో చిన్నారి మైథిలితో కలసి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గ మధ్యలోనే మృత్యుఒడికి చేరుకున్నారు.
స్నేహితుడితో కలసి..
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలోని గురప్పన పాళ్యలో మెకానిక్‌గా పనిచేసే షోయబ్.. బైకులు, కార్ల మరమ్మతులకు అవసరమైన విడిభాగాలను హైదరాబాద్‌కు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఇదే విధంగా మంగళవారం రాత్రి స్నేహితుడు అకీబ్‌తో కలసి ప్రమాదానికి గురైన బస్సులో (సీట్ నం.. ఏ11, బీ11)లో హైదరాబాద్‌కు బయలుదేరారు. ప్రమాదంలో కన్నుమూశారు.