
సంక్షోభంలో తుమ్మపాల
తుమ్మపాల చక్కెర కర్మాగారం గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో చిక్కుకుంది. ఈ సుగర్స్ పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్నది.
- మూత దిశగా చక్కెర కర్మాగారం
- పాత యంత్రాలతో తగ్గుతున్న రికవరీ
- పదేళ్లుగా నష్టాల బాట
- చెరకు రైతులకు పైసా చెల్లించలేని దుస్థితి
అనకాపల్లి, న్యూస్‌లైన్ : తుమ్మపాల చక్కెర కర్మాగారం గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో చిక్కుకుంది. ఈ సుగర్స్ పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్నది. 2013-14 సీజన్లో ఫ్యాక్టరీకి చెరకు తరలించిన రైతులకు చెల్లింపులు లేకపోవడం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం వంటి పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. దీని ఆధునికీకరణకు నిధులు మంజూరవుతాయనే ఆశలు కనుచూపుమేరలో కానరావడం లేదు.
ఈ మిల్లులో చెరకు క్రషింగ్ 33 శాతం తగ్గి మూత దిశగా సాగుతోంది. దీనిని 1937లో అప్పటి యంత్రాలతో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ వీటిని ఆధునికీకరించకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. ఈ సుగర్స్ నష్టాలు రూ.14 కోట్లను దాటిపోయాయి. ఈ సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు రూపాయి కూడా చెల్లించలేదు. 28,286.2 టన్నులకు రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉంది.
కార్మికులకు మూడు నెలల జీతాలు రూ.70 లక్షలు బ కాయి పడింది. రెండేళ్ల నుంచి కార్మికులు, ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలకు పైసా జమచేయడం లేదు. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రూ.80 లక్షలు గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంది. ఈ సీజన్‌లో కొన్ని ప్రైవేటు ఫ్యాక్టరీలు గరిష్టంగా 10.9శాతం రికవరీ సాధిస్తే తుమ్మపాల 7.9శాతానికి దిగజారిపోయింది.
ఈ కారణంగా టన్ను చెరకుపై రైతులకు రూ.600 వరకు నష్టం వస్తోంది. కొన్ని కర్మాగారాల్లో గరిష్టంగా రోజుకు 7500 టన్నులు గానుగాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటే ఈ ఫ్యాక్టరీలో 500 టన్నుల క్రషింగ్ కనాకష్టమవుతోంది. ఇలా ఈ సీజన్‌కు సంబంధించి రూ.9 కోట్లు, రానున్న సీజన్ ప్రారంభానికి రూ.5 కోట్లు కావాలి. చెరకు క్రషింగ్ సీజన్ వస్తే తప్ప ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు. దీనికి తోడు లోటు బడ్జెట్, రాష్ట్ర విభజన తతంగం, మిగిలిన కర్మాగాలపై నివేదన అంటూ ప్రభుత్వం కాలయాపన తప్పదు. ఈ నేపథ్యంలో తుమ్మపాల కర్మాగారం భవితవ్యం మరోసారి ప్రశ్నార్థకమవుతోంది.
హామీలు దాటని ఆధునికీకరణ
తాము అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామన్న ఆయా పార్టీల హామీలు పరిపాటిగా మారాయి. తెలుగుదేశం హయాంలో అప్పట్లో రెండేళ్లపాటు ఏకంగా మూతపడి అమ్మకంబాట పట్టింది. 2004లో మహానేత వైఎస్సార్ హయాంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఫ్యాక్టరీని తెరిపించింది. అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంటు నుంచి ప్రాతినిధ్యం వహించిన గంటా శ్రీనివాసరావు మంత్రిగా దీని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు.
ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి వచ్చిన అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దీని ఆధునికీకరణకు రూ.7.56 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. రూపాయి కూడా విడుదల చేయలేదు. గత సీజన్(2012-13)లో ఈ ఫ్యాక్టరీ 38 వేల టున్నుల చెరకు గానుగాడింది. ప్రోత్సాకంగా టన్నుకు రూ.200 చొప్పున రూ.76 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
రైతుల్లో ఆందోళన
జిల్లాలోని ఒక్క గోవాడ(చోడవరం) చక్కెర కర్మాగారం మాత్రం లాభాల్లో పయనిస్తోంది. ఏటి కొప్పాక మూడేళ్లుగా లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ గతంలో పేరుకుపోయిన నష్టాల నుంచి గట్టెక్కలేకపోతోంది. తుమ్మపాల పదేళ్లుగా నష్టాలనే మూటగట్టుకుంటోంది. ఏడాదికేడాది కనాకష్టంమీద గానుగాడుతోంది.
పురాతన యంత్రాలు,పరికరాలతో ప్రతి సీజన్‌లోనూ తుమ్మపాల, తాండవ ఫ్యాక్టరీల్లో క్రషింగప్పుడు అంతరాయం ఏర్పడుతోంది. పరోక్షంగా రికవరీ రేటు పడిపోతోంది. సహకార రంగంలోని చక్కెర కర్మాగారాల పరిస్థితి నానాటికీ దిగజారి పోతుంటే రైతులను ఆదుకునే నాధుడెవ్వరన్న వాదన వ్యక్తమవుతోంది. రానున్న సీజన్‌కైనా దీనిని ఆధునికీకరించకపోతే దీని పరిధిలోని రైతులు నిండా మునిగిపోవడం ఖాయం.