రీమెల్టింగ్ విధానం చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీని నట్టేట ముంచేస్తోంది. రికవరీ శాతం పడిపోవడం, ఉత్పత్తి అవుతున్న చక్కెర నాసిరకంగా ఉండడంతో దాన్ని రీమెల్టింగ్ (కరగబెట్టి మళ్లీ చక్కెర ఉత్పత్తి చేయడం) చేయక తప్పడం లేదు.
చిత్తూరు(గిరింపేట), న్యూస్‌లైన్ : రీమెల్టింగ్ విధానం చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీని నట్టేట ముంచేస్తోంది. రికవరీ శాతం పడిపోవడం, ఉత్పత్తి అవుతున్న చక్కెర నాసిరకంగా ఉండడంతో దాన్ని రీమెల్టింగ్ (కరగబెట్టి మళ్లీ చక్కెర ఉత్పత్తి చేయడం) చేయక తప్పడం లేదు. అయితే రీమెల్టింగ్ చేసేటప్పుడు ఆ యంత్రాల వద్ద పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చక్కెర సిరప్‌ను సక్రమంగా పంపింగ్ చేయలేక లీకేజీలతో రోజుకు ఒకటిరెండు బస్తాల చొప్పున కాలువ పాలు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.70 కోట్లకు పైగా నష్టాల్లో ఫ్యాక్టరీ కూరుకుపోయింది. మూసివేత దిశగా నడుస్తున్న ఫ్యాక్టరీకి ఈ రీమెల్టింగ్ విధానం గోరుచుట్టుపై రోకలి పోటులా తయారైంది. కాగా నవంబర్ 27 నుంచి చెరుకు క్రషింగ్ ప్రారంభమైంది. గడచిన 15 రోజుల్లో 21 వేల టన్నుల చెరుకును అధికారులు క్రషింగ్ చేశారు. చక్కెర రికవరీ 7.5 శాతం వచ్చింది. 15 వేల బస్తాల (క్వింటాళ్ల) చక్కెర ఉత్పత్తయ్యింది. చెరుకు నాణ్యత లేకపోవడంతో రికవరీ శాతం పడిపోతోంది. నాణ్యత (నలుపురంగు మిక్సింగ్‌తో ఉండడం) కూడా లోపించింది.
రీమెల్టింగ్ చేస్తే
తప్ప అది అమ్ముడు పోయే పరిస్థితి లేదు. ఈ విధంగా ఉత్పత్తి అయిన చక్కెరలో దాదాపు వెయ్యిబస్తాలు రీమెల్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే గత ఏడాది ఉత్పత్తయిన 55 వేల క్వింటాళ్ల చక్కెర నిల్వలు అమ్ముడుపోక గోడౌన్‌లో మూలుగుతున్నాయి. దీనికి తోడు ఈసారీ రికవరీ త గ్గిపోయి నాణ్యతలేని చక్కెర ఉత్పత్తవుతోంది. దీన్ని మార్కెట్‌లో ఎలా విక్రయిస్తారో అధికారులకే తెలియాలి. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీకి పాలకవర్గం లేనందున పర్సన్ ఇన్‌చార్జిగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపట్ల ఆయన కినుక వహించడంతో పాటు ఫ్యాక్టరీ విషయాలను పట్టించుకోవడం లేదు.
ఆగిపోయిన చెరుకు క్రషింగ్
తొలిరోజు 500 టన్నులతో చేపట్టినా క్రమంగా ఐదోరోజుకు 1,500 టన్నుల క్రషింగ్ వరకు చేరుకుంది. ఇలా పది రోజులు సవ్యంగా జరిగినా ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి. గత ఏడాది చెరుకు తోలిన రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఇంతవరకు చెల్లించలేదు. నవంబర్ నెలాఖరులోగా చెల్లిస్తామని నెల్లూరులో మంత్రి ఆనం ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో రైతులు ఫ్యాక్టరీకి చెరుకును సరఫరా చేయడం నిలిపేశారు. ఫలితంగా గురువారం నుంచి క్రషింగ్‌ను ఆపేశారు. పగలంతా క్రషింగ్‌ను ఆపేసి రాత్రివరకు సేకరించుకున్న చెరుకును ఒకటిరెండు గంటలు మాత్రమే క్రషింగ్ చేస్తున్నారు. సీజన్ ప్రారంభమై 15 రోజులూ గడవకముందే క్రషింగ్‌ను ఆపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక రానున్న మూడు నెలల సీజనులో మరెన్నిసార్లు క్రషింగ్‌ను ఆపాల్సివస్తుందోననే భయం అధికారులను వెంటాడుతోంది. దీంతో చెరుకు సరఫరా చేసేందుకు ముందుకొచ్చే రైతులకు ఫ్యాక్టరీ తరపున కూలీలను పంపేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కూలిని రైతులు భరించడమా లేక వారికయ్యే కూలీల ఖర్చులో సగం ఫ్యాక్టరీ భరించడమా అనే విషయంలోనూ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. అయితే ఈ పద్దతి ఇప్పటివరకు లేదు.
బకాయిలపై అసెంబ్లీలో ప్రస్తావన
నష్టాల్లో కూరుకుపోయి వర్కింగ్ క్యాపిటల్ కూడా లేని పరిస్థితిలో క్రషింగ్‌ను చేపట్టిన చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీకి కొంతగ్రాంటును విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని చిత్తూరు శాసనసభ్యులు సీ.కె.బాబు కోరారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, పెండింగ్ ఉన్న ఆరు నెలల సిబ్బంది జీతాల మొత్తాన్ని త్వరలోనే చెల్లిస్తామని ఉన్నతాధికారులు సమాధానం చెప్పారు. రీమెల్టింగ్‌లో నష్టపోతున్న తీరుపై ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా చక్కెర నాణ్యతలేని కారణంగా రీమెల్టింగ్ చేయాల్సివస్తోందన్నారు. సీజను ప్రారంభంలో ఇది మామూలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంచుమించు ఏడెనిమిదివందల బస్తాల చక్కెరను రీమెల్టింగ్ చేయాల్సి ఉందన్నారు. రీమెల్టింగ్‌లో లీకేజీలనేవి మామూలేనని తేలిగ్గా తీసిపడేశారు.