
‘వైకుంఠ’ దర్శన టికెట్ల కోసం ఒత్తిడి
టీటీడీకీ భారీగా అందుతున్న లేఖలు
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శన టికెట్ల కోసం టీటీడీపై ఒత్తిడి పెరిగింది. అతిముఖ్యమైన ఆ పర్వదినాన స్వామిని దర్శించుకునేందు కు ప్రముఖులు పోటెత్తనున్నారు. ఆ మేరకు లేఖలు అందుతున్నా పరిమిత సంఖ్యలోనే టికెట్లు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ఈనెల 8న వైకుంఠ ఏకాదశి, 9న ద్వాదశి ఘడియల్లో మాత్రమే తిరుమల ఆలయంలోని వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) తెరిచి భక్తులను అనుమతిస్తారు. ప్రదక్షిణ చేసేందుకు వీఐపీ భక్తులు మరింత పోటెత్తే అవకాశం ఉందని ఇప్పటికే టీటీడీ అధికారులు అంచనాకు వచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే వందల సంఖ్యలో లేఖలు, ఫ్యాక్స్ సమాచారం, సెల్‌ఫోన్ సందేశాలు అందుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణకు చెందిన సుమారు 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరో 20 మంది ఎంపీలు, 200 మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, మరో 100 దాకా న్యాయవిభాగం ప్రముఖులు రానున్నారు. ఆ మేరకు వారి నుంచి వైకుంఠ దర్శనం కోసం టీటీడీకి సిఫారసు లేఖలు అందాయి. వీఐపీలు, వారి బం«ధువులు కలిపి వేల సంఖ్యలోనే తిరుమలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
టికెట్లలో భారీగా కోత
రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాల్లో భారీగా కోత వేసి, ఒకరికి 6 టికెట్లు మించకుండా కేటాయింపులు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు భావిస్తున్నారు. 2014లో ఏకాదశి రోజున 2,700 టికెట్లు, 2015లో 2,800 టికెట్లు మాత్రమే కేటాయించి, వారికి వేకువజామున 3.30లోపే దర్శనం పూర్తి చేశారు. అదే విధానాన్ని ఈసారి కూడా అమలు చేయా లని యోచిస్తున్నారు. ఏకాదశిన తరలివచ్చే ప్రముఖులకు బస, దర్శనం కల్పించే విషయంలో టీటీడీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. గదుల కేటాయింపును రెవెన్యూ, రిసెప్షన్ విభాగా««ధిపతులకు అప్పగించింది. వీటిని సజావుగా నిర్వ హించేందుకు 60 మందికిపైగా సిబ్బందిని నియమించారు. 7వ తేదీ నుంచే సుమారు 3 నుంచి 4 వేల వరకు గదులు ముందస్తుగా బ్లాక్ చేయనున్నారు.