సాక్షి ప్రతినిధి, ఏలూరు :పుష్కరాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. ఎక్కడా ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళవారం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఇప్పటికీ ఎక్కడా ఘాట్ల పనులు పూర్తి కాలేదని, మరో ఆరు రోజుల్లో ఏ మేరకు పూర్తవుతాయన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘అన్ని పనులూ పూర్తవుతాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. వివిధ శాఖలు చేపట్టిన 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలింది ప్యాచ్‌వర్క్‌లు, రంగులేసే పనులే. అవన్నీ పుష్కరాలకు రెండురోజుల ముందే కచ్చితంగా పూర్తవుతాయి’ అన్నారు.
4 వేల వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు
కొవ్వూరులో నాలుగువేల వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సుజాత చెప్పారు. జిల్లాలోని 8 డిపోలకు చెందిన 618 బస్సులతోపాటు గుంటూరు, విజయవాడ నుంచి 120 బస్సులను, మరో 15 నూతన మెట్రో లైనర్ బస్సులను రప్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇరిగేషన్, రోడ్లు భవనాల శాఖ, పంచాయితీరాజ్, దేవాదాయ శాఖ పనులతోపాటు కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు మునిసిపాలిటీల్లో 1,147 అభివృద్ధి పనులను రూ.523.93 కోట్లతో చేపట్టామని తెలిపారు. కొవ్వూరులో గతంలో 65 మీటర్లు ఉన్న స్నానఘట్టాన్ని రూ.6 కోట్లు వెచ్చించి 192 మీటర్లు పొడువున విస్తరించామన్నారు. కొవ్వూరు పట్టణానికి రూ.4.48 కోట్ల వ్యయంతో మరో బైపాస్ రోడ్డు ఏర్పడిందన్నారు.
వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక ఏర్పాట్లు
పుష్కరాలకు విచ్చేసే కోట్లాదిమంది భక్తుల్లో ఏ ఒక్కరికీ అసౌకర్యం కలగకూడదనే లక్ష్యంతో ఏర్పాట్లు చేశామని మంత్రి చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
పనులన్నీ పూర్తవుతాయి
Published Wed, Jul 8 2015 1:25 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement
Advertisement