బోరు ఏర్పాటుకు టీడీపీ మోకాలడ్డు
తాడిపత్రి: పట్టణంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, సొంత ఖర్చులతో బోరు వేయించేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు తీసుకున్న చర్యలను అడ్డుకోవడంతో అమ్మా పెట్టదు.. అడుక్కు తినానివ్వదన్న చందంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తాడిపత్రి మున్సిపాలిటీలోని 3వ వార్డు ఎద్దుల గేరిలో తాగునీటి ఎద్దడి తీవ్రం కావడంతో, సమస్య పరిష్కరించాలంటూ ఆ ప్రాంత వాసులనుంచి కౌన్సిలర్ మున్నాకు విన్నవించుకున్నారు.
అందుకు స్పందించిన ఆయన శుక్రవారం రిగ్గును రప్పించి బోరు వేయిస్తుండగా మున్సిపల్ ైవె స్ చైర్మన్ జిలాన్ బాషా, మైనార్టీ నాయకులు ఫయాజ్ బాషా, కౌన్సిలర్లు ఇక్బాల్, సాదక్ టీడీపీకి చెందిన ఇతర నాయకులు పనులను అడ్డుకున్నారు. బోరు వేయాలంటే మున్సిపాలిటీ వారు వేస్తారని, ఆ పని చేసేందుకు మీరెవరంటూ ప్రశ్నించారు.
విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు రమేష్‌రెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రంగనాథ్‌రెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. ఇన్నాళ్లూ తాగేందుకు నీటి సరఫరాలో విఫలమైన అధికారులు, తగుదునమ్మా అంటూ ఇప్పుడు రావడం విడ్డూరంగా ఉందంటూ మున్సిపల్ అధికారులు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లుతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో మున్సిపల్ సిబ్బంది హడావుడిగా కాలనీలోకి నీటి ట్యాంకర్లు పంపించారు. అక్కడే ఉన్న రిగ్గును పంపించి, సాయంత్రం లోపు బోరును తామే ఏర్పాటు చేస్తామని చెప్పడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు మిన్నకుండిపోయారు.
డీఎస్పీకి ఫిర్యాదు
ఈ సంఘటనపై వైఎస్సార్‌సీపీ నాయకుడు రమేష్ రెడ్డి డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. వార్డు ప్రజల కోసం కౌన్సిలర్ బోరు వేయించడాన్ని రాజకీయ కోణంలో చూ డాల్సిన పని లేదని, ఇన్ని రోజులుగా స్పందించని నాయకులు ఇప్పుడు హడావుడిగా స్పందించడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. అధికారులు బోరు వేయిస్తే తమకు అభ్యంతరం లేదని, వారు చర్యలు తీసుకోని పక్షంలో తాము బోరు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.