
సాక్షి, తిరుమల: తిరుమలకు వచ్చే భక్తులు ఎక్కువ మోతాదులో లడ్డూలు కోరుతున్నారని.. అందుకే వాటిని మాత్రమే అధిక ధరలకు విక్రయించనున్నట్లు జేఈఓ శ్రీనివాసరాజు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. రూ.100 ధరతో ఉన్న పెద్ద లడ్డూను రూ.200కి, రూ.25 ధరతో కూడిన వడను రూ.100కి, రూ.25 లడ్డూను రూ.50కి, ఆలయంలో ఉచితంగా అందజేసే ఉచిత లడ్డూను రూ.7 ధరతో సరఫరా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
టీటీడీ నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణాలతో పాటు ధార్మిక సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు మాత్రమే పరిమితి సంఖ్యలో లడ్డూలు, వడలు సరఫరా చేసేవారమని చెప్పారు. తిరుమల ఆలయ నాలుగు మాడ వీధుల్లో 1.8 లక్షల మందికి భక్తులు గ్యాలరీల్లో కూర్చుని వాహన సేవల్ని వీక్షించే అవకాశ ముందని జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు ఎక్కువ మంది భక్తులు ఆలయ వీధుల్లో కూర్చునే విధంగా మాడ వీధులను విస్తరిస్తామని దానికి తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.