ప్రాథమిక విద్యారంగంలో కొన్ని నెలలుగా చర్చనీయాంశమవుతున్న ఉమ్మడి పరీక్షాపత్రం, మూల్యాంకన ప్రక్రియపై సందిగ్ధం వీడింది.
విజయనగరం అర్బన్: ప్రాథమిక విద్యారంగంలో కొన్ని నెలలుగా చర్చనీయాంశమవుతున్న ఉమ్మడి పరీక్షాపత్రం, మూల్యాంకన ప్రక్రియపై సందిగ్ధం వీడింది. ఈ ఏడాదికి 1నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష విధానం లేదని, పూర్తిస్థాయిలో వచ్చేఏడాది నుంచి అమలు చేస్తామని ఎట్టకేలకు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 1 నుంచి 9 తరగతి విద్యార్థులందరికీ ఒకే తరహా ప్రశ్నపత్రంతో ఈ ఏడాది సమ్మెటివ్-3 (తుది పరీక్షలు) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. ఇప్పటి వరకు వేర్వేరు రకాల పాఠ్యపుస్తకాలు, వేర్వేరు ప్రశ్నపత్రాలు ఉపయోగించి ఆయా తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. జిల్లాల వారీగా ప్రశ్నపత్రాలు వేర్వేరుగా ఉండేవి. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రమాణాల పరంగా తేడా ఉండేది.
ఈ కారణంగానే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రాథమిక స్థాయి తరగతులకు ఉమ్మడి పరీక్ష విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరాయి. ఈ మేరకు ప్రాథమిక స్థాయిలో ఏకీకృత ప్రశ్నపత్రాన్ని ఇచ్చే విధానాన్ని ఈ ఏడాదికి విరమించుకున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతానికి 5వ తరగతిలోపు వారికి ఉమ్మడి పరీక్ష పత్రం విధానం నుంచి మినహాయింపు ఇవ్వడంతో ఇటు ప్రైవేటు, అటు ప్రభుత్వ పాఠశాలలు ఊరట చెందుతున్నాయి. పాత పద్ధతుల్లోనే ఈ ఏడాదికి ప్రాథమిక స్థాయి పరీక్షలను నిర్వహించే వెసులుబాటు లభించింది. అయితే 6వ తరగతి నుంచి 9వతరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మాత్రం ఈ ఏడాది నుంచే కామన్ ప్రశ్నపత్రంతో పరీక్షలు జరపనున్నారు.
జిల్లాలో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 1,45,300 మంది ఉన్నారు. వీరిలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు 1,05,600 మంది, మిగిలిన 39,700 మంది ప్రైవేటు పాఠశాల విద్యార్థులు. ఈ సంఖ్యతో మొత్తం ప్రశ్నపత్రాలకు జిల్లానుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇప్పటికే జిల్లా డీసీఈబీకి అందిన సీడీల ఆధారంగా ప్రశ్నపత్రాల ముద్రణ పూర్తయింది. వాటిని నిర్దేశిత కేంద్రాల ద్వారా మండలాలకు పంపిణీ చేయనున్నారు. వీరికి ఏప్రిల్ 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలుకు అనుగుణంగా పరీక్షలు జరపనున్నారు. గతంలో జిల్లాలోని వివిధ సబ్జెక్టుల నిపుణులు ప్రశ్నపత్రాలు రూపొందించే వారు. ఇప్పుడు ఎస్‌సీఈఆర్టీ నిపుణులు రూపొందించిన ప్రశ్నావళికి విద్యార్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల యాజమాన్యాల్లోని పాఠశాలలకు ఒకే తరహా పరీక్ష ఉంటుంది కాబట్టి. హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉండదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఎలిమెంటరీకి మినహాయింపు
దీనిపై జిల్లా డీసీఈబీ కార్యదర్శి తవిటినాయుడు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఏప్రిల్ 18 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు జరపనున్నట్లు వెల్లడించారు. 6 నుంచి 9వ తరగతుల వారికి ఉమ్మడి పరీక్ష విధానం ఈ ఏడాది నుంచే అమలుచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.