తదితర ప్రైవేటు డెయిరీలకు పాలు పోస్తున్నారు. విజయ డెయిరీ జిల్లా వ్యాప్తంగా 150 సహకార సంఘాల పరిధిలో 420 పైగా ఉన్న కేంద్రాల ద్వారా పాలసేకరణ చేస్తోంది. వీటితో పాటు మరో 500 ప్రైవేటు కేంద్రాల ద్వారా పాలసేకరణ జరుగుతోంది. పాడి రైతుల ద్వారా జిల్లాలో ప్రతి రోజూ 1.50 లక్షల లీటర్ల వరకు పాలు సేకరిస్తున్నారు.
కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, గతేడాది పాలసేకరణలో తలెత్తిన ఇబ్బందుల పరంపరలో చాలామంది పాడిరైతులు గేదెల్ని అమ్మేశారు. పెరిగిన ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా పాలకు మద్దతు ధర దక్కకపోవడంతో పాటు పాలసేకరణ హాలీడేలు ప్రకటించడంతో అనేక మంది రైతులు ఈ ఏడాది గేదెల పెంపకంపై నిరాసక్తత చూపారు. కాని ఈ ఏడాది ఊహించని విధంగా పాలకు డిమాండ్ ఏర్పడింది. కనీసం జిల్లా అవసరాలకు కూడా సరిపడా పాలు లభ్యం కాలేదు. ప్రైవేటు డెయిరీలు ఉత్పత్తిదారులకు మొండిచెయ్యి చూపించినా ఏజెంట్లకు మాత్రం భారీగా తాయిలాలు ఎరవేసి పాల సేకరణ పెద్దగా పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాని విజయ డెయిరీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో సేకరణ పూర్తిగా పడిపోయింది.
ఈ నేపథ్యంలో పాడి రైతులకిచ్చే పాల ధరను పెంచి తమ అవసరాలకు అనుగుణంగా పాల సేకరణ చేయాల్సిన విజయ డెయిరీ ప్రైవేటు డెయిరీలతో కుమ్మక్కై ఉత్పత్తిదారులకిచ్చే ధరను మాత్రం పెంచడం లేదు. ప్రైవేటు డెయిరీలు మాత్రం తమ మార్కెట్ దెబ్బతినకుండా కాపాడుకుంటుండగా, విజయ డెయిరీకి మాత్రం మార్కెట్‌లో ఇబ్బంది తప్పలేదు. విజయ డెయిరీకి చెందిన పాలసేకరణ ఏజెంట్లు, సహకార సంఘాల అధ్యక్షులు ధర పెంచాలని డిమాండ్ చేస్తున్నా డెయిరీ పాలకవర్గం పట్టించుకున్న పరిస్థితులు కనిపించలేదు.
రోజుకు రూ.4.50 లక్షలు కోల్పోతున్న రైతులు
జిల్లాలోని విజయ డెయిరీ తీరు కారణంగా రైతులు రోజుకు సగటున రూ.4.50 లక్షలు నష్టపోతున్నారు. పొరుగున ఉన్న ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని విజయ డెయిరీ ఈ నెల 11వ తేదీ నుంచే పాడి రైతులకిచ్చే ధరను గణనీయంగా పెంచింది.
లీటరు రూ.46 నుంచి ఒక్కసారిగా రూ.49కి పెంచింది. ఆ జిల్లాల్లో ప్రైవేటు డెయిరీలు కూడా ధరను పెంచాయి. జిల్లాలో మాత్రం ప్రస్తుతం లీటరు రూ.46 మాత్రమే చెల్లిస్తున్నారు. జిల్లాలో కూడా విజయ డెయిరీ పాల సేకరణ ధరను పెంచి ఉంచి ప్రైవేట్ డెయిరీలు కూడా పెంచేవి. తద్వారా రైతులకు లీటరుకు మూడు రూపాయల వంతున ప్రయోజనం దక్కేది.
కొనుగోలుదారులకు పెరిగిన ధర
జిల్లాలో ఇప్పటికే ప్రైవేటు డెయిరీలన్నీ తాము అమ్మే పాల ధరను లీటరు రూ.2 పెంచాయి. విజయ డెయిరీ కూడా నేడో.. రేపే ధరను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో ప్రజలకు అమ్మే పాలపై ధరను పెంచిన డెయిరీలు మాత్రం ఉత్పత్తిదారులకు పెంచేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు.
పాలసేకరణ ధరను పెంచాలి
ప్రస్తుతం కరువొచ్చింది. పశువులకు మేత, నీళ్లు దొరకడం కట్టంగా మారింది. దీనికి తోడు దాణా ధరలు కూడా బాగా పెరిగాయి. పాలకు మాత్రం ధర పెరగలేదు. గేదలు పోషించడం కష్టంగా మారింది. డెయిరీలో ధర పెంచకపోతే నష్టాలు తప్పవు.
నాగిరెడ్డి, పాడి రైతు
రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం
ఇటీవలే రైతులకిచ్చే పాల ధరను రూ.2 పెంచాం. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో మళ్లీ ఇప్పుడే పెంచాలంటే ఇబ్బందిగా ఉంది. వీలైనంత వరకు రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు కృషి చేస్తున్నాం. పెరిగిన ఖర్చుల దృష్ట్యా ప్రజలకు తాము విక్రయించే పాలధరను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాలకమండలిలో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తాం.
కృష్ణమోహన్, జీఎం, విజయ డెయిరీ