ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లకు ఆయా కళాశాలలే ప్రత్యేక ప్రవేశపరీక్ష నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిం చింది.
గవర్నర్ సలహాదారుతో అధికారులు, యాజమాన్యాలు భేటీ సానుకూల స్పందన.. వారం రోజుల్లో జీవో జారీ
హైదరాబాద్: ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లకు ఆయా కళాశాలలే ప్రత్యేక ప్రవేశపరీక్ష నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిం చింది. మొత్తం 85 శాతం సీట్లకు (15 శాతం ప్రవాస భారతీయ కోటా-ఎన్నారై సీట్లను మినహాయించి) ఈ ప్రవేశపరీక్ష జరుగుతుంది. దీనిపై మైనారిటీ, నాన్‌మైనారిటీ వైద్య కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు పలువురు అధికారులు బుధవారం గవర్నర్ సలహాదారు ఏఎన్ రాయ్‌ని కలిశారు. సుమారు గంటసేపు ప్రైవేటు వైద్యకళాశాలల్లో ఉన్న సీట్లపై చర్చించారు. ఎంసెట్ పరీక్ష ముగిసిన తర్వాత వారం రోజుల్లో ప్రైవేటు కళాశాలల అసోసియేషన్ ప్రత్యేక ప్రవేశపరీక్షను నిర్వహిస్తుంది. దీనికోసం వారం రోజుల్లో జీవోను విడుదల చేయనున్నట్టు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
ఎన్నారై కోటా మినహాయింపు..
ప్రవాస భారతీయ కోటాలో ఉన్న సీట్లను వైద్య కళాశాలల యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు కళాశాలల్లో 3,560 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 15 శాతం ఎన్నారై కోటా మినహాయిస్తే 3,100 సీట్లకు పైగా ప్రవేశపరీక్ష కిందకు వస్తాయి. వీటన్నిటికీ త్వరలోనే కామన్ ఫీజు నిర్ణయిస్తారు. ఇకపై కన్వీనర్ కోటా, బి కేటగిరీ ఇలాంటివేమీ ఉండవు. అందరూ కామన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.