
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై ప్రివిలేజ్ మోషన్
హైదరాబాద్ : స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారంటూ పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత బుధవారం తొమ్మిదిమంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. సభాపతిని కించపరిచే విధంగా మాట్లాడినందున ఆ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సభా హక్కుల తీర్మానంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై చర్చకు వచ్చినప్పుడు మాట్లాడేందుకు అవకాశమిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది.
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, కె.శ్రీధర్ రెడ్డి, ఆర్.శివప్రసాద్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బి.ముత్యాల నాయుడు, ఆర్.కె.రోజాలపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇచ్చారు.