ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో రోజుకో సమస్య ఎదురవుతోంది. కౌన్సెలింగ్ స్థానంలో ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సెలింగ్‌పై కనీస పరిజ్ఞానం లేకుండానే
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో రోజుకో సమస్య ఎదురవుతోంది. కౌన్సెలింగ్ స్థానంలో ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సెలింగ్‌పై కనీస పరిజ్ఞానం లేకుండానే ఉపాధ్యాయులు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. బదిలీ కోరుతూ ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు విద్యాశాఖ విడుదల చేసిన ఖాళీల జాబితా ఆధారంగా తిరిగి ఆన్‌లైన్‌లోనే ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉండగా, ఆప్షన్లు ఏ విధంగా ఎంపిక చేసుకోవాలనే విషయమై ఉపాధ్యాయులకు కనీస పరిజ్ఞానం లేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది.
ప్రభుత్వ విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా ఆదివారం నుంచి ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉండగా, పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ తెరుచుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈనెల 8వ తేదీ లోపు ఆప్షన్లు ఇచ్చుకున్న వారే బదిలీకి అర్హత పొందుతారని ప్రభుత్వం ప్రకటించడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన రేకెత్తుతోంది. ఉదాహరణకు.. ఇంజినీరింగ్, బి. ఫార్మసీ తదితర కోర్సుల్లో చేరే సమయంలో విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్ కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తారు.
హెల్ప్‌లైన్ సెంటర్లో కాకుండా ఇంటి వద్దే ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నా అందుకు తగిన మార్గదర్శకాలతో కూడిన బుక్‌లెట్ ఇచ్చి, ఒక్కో దశలో సూచనలు అందించే పరిస్థితులు ఉండగా, ఉపాధ్యాయులకు మాత్ర ఇటువంటి ఏవీ లేకుండానే ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. గ్రామీణ ప్రాంతాల ఉపాధ్యాయులకు ఇది మరింత జటిలంగా మారింది. బదిలీకి దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులు కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించే పాఠశాలల్లో తమకు నచ్చిన వాటిని క్లిక్ చేసే విధానంలోనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కొందరికి మేలు చేసేందుకు ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న నిర్ణయంతో ఉపాధ్యాయులందరూ ఇబ్బందుల పాలవుతున్నారు.
బదిలీ రేసులో 4,703 ఉపాధ్యాయులు.. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల పరిధిలో బదిలీ కోరుతూ దాఖలైన 5,434 దరఖాస్తుల్లో అభ్యంతరాలు, సమగ్ర పరిశీలన తర్వాత అధికారులు 4,703 దరఖాస్తులను ఖరారు చేశారు. అదేవిధంగా ఉద్యోగ విరమణ, ఉపాధ్యాయుల కొరత కారణంగా జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో 1,862 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బదిలీకి దరఖాస్తు చేసిన 4,703 మంది హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, ఎల్‌పీటీ ఉపాధ్యాయుల్లో సీనియారిటీ ఆధారంగా 1,862 మంది ఉపాధ్యాయులే బదిలీ పొందుతారు.