గొంతెండుతోంది.. | problems for drinking water | Sakshi
Sakshi News home page

గొంతెండుతోంది..

Published Wed, Jun 25 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM

గొంతెండుతోంది..

గొంతెండుతోంది..

జిల్లాలో తాగునీటి సమస్యతో జనం గొంతెండుతోంది. జూన్ నెలాఖరు వచ్చేసినా వేసవి ఎండలు కొనసాగుతుండటంతో గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లో నీరుఅడుగంటింది.

గ్రామాల్లో అడుగంటినతాగునీటి చెరువులు
తాగునీటి విడుదలపై తొలగని సందిగ్ధత
తీరంలో దాహం కేకలునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం
6 టీఎంసీలకు గాను 4 టీఎంసీలు మాత్రమే
ఇచ్చేందుకు అధికారుల నిర్ణయం
శివారుకు తాగునీరు చేరాలంటే పది రోజుల సమయం


జిల్లాలో తాగునీటి సమస్యతో జనం గొంతెండుతోంది. జూన్ నెలాఖరు వచ్చేసినా వేసవి ఎండలు కొనసాగుతుండటంతో గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లో నీరుఅడుగంటింది. కళ్లెదుటే అంతా కనబడుతున్నా పాలనా యంత్రాంగంలో వీసమెత్తు చలనం లేకుండా పోయింది. వెరసి జిల్లాలోని ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. ఓ వైపు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల కారణంగా తాగునీటి వినియోగం అధికమైంది. తాగునీటి చెరువులు నీరు అడుగంటి వెక్కిరిస్తున్నాయి. చెరువుల్లో అడుగున ఉన్న బురదనీటినే తాగునీటిగా సరఫరా చేస్తూ పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. దుర్వాసన వస్తున్న నీటిని తాగితే ఎలాంటి అనారోగ్యం పాలవుతామేమోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
 
 మచిలీపట్నం : జిల్లా ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం ఈ నెల 25న నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తామని పాలకులు చెబుతూ వచ్చారు. మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖాధికారులు హైదరాబాదులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లాకు తాగునీటి అవసరాల నిమిత్తం నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ ఎస్‌ఈ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాకు ఆరు టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా నాలుగు విడుదల చేయడం వల్ల తాగునీటి అవసరాలకు సరిపోదని నిపుణులు చెబుతున్నారు. ఈ నీటినైనా నాగార్జునసాగర్ నుంచి ఎప్పటికి విడుదల చేస్తారు.. ఎప్పటికి చెరువులు నిండుతాయి.. తాగునీట సమస్య ఎప్పుడు తీరుతుందని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు.

అడుగంటుతున్న తాగునీటి చెరువులు...

జిల్లాలో తాగునీటి చెరువులు 374 ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కాలువలకు నీటి విడుదల నిలిపివేశారు. ఈ ఏడాది వేసవి కాలం సుదీర్ఘంగా సాగటం, జూన్ నెలాఖరు వచ్చేస్తున్నా వర్షాలు కురవకపోవటంతో తాగునీటి చెరువుల్లో నీరు పూర్తిగా అడుగంటింది. ఈ నెల 25న తాగునీటిని విడుదల చేస్తామని గతంలో పాలకులు ప్రకటించటంతో ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి మచిలీపట్నం, పెడన తదితర పురపాలక సంఘాలకు ప్రతి రోజూ తాగునీటిని గంట, అరగంట సమయం పాటు విడుదల చేస్తున్నారు. నీటి వినియోగం పెరగటంతో రిజర్వాయర్లలోని నీరు అడుగంటింది. జిల్లాలోని 80 శాతం పైగా తాగునీటి చెరువులు  అడుగుమేర నీటి మట్టానికి చేరుకున్నాయి. అడుగంటిన నీరు కలుషితమవడంతో వాటిని తాగలేని పరిస్థితి నెలకొంది.

అడుగంటిన భూగర్భ జలాలు...

జూన్ నెల పూర్తవుతున్నా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న కారణంగా భూగర్భ జలాలు అడుగంటాయి. చల్లపల్లి, మోపిదేవి వంటి ప్రాంతాల్లో బోరు నీటినే తాగునీటిగా సరఫరా చేస్తున్నారు. బోర్లు సక్రమంగా పనిచేయకపోవటంతో తాగునీరు పూర్తిస్థాయిలో ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సముద్ర తీరంలోని గ్రామాల్లో వర్షాకాలంలో బావుల్లో 12 అడుగుల లోతున తాగునీరు లభ్యమయ్యే పరిస్థితి ఉండేది. వేసవిలో భూగర్భ జలాలు 14 నుంచి 16 అడుగుల లోతుకు నీటి మట్టం తగ్గింది. దీంతో కాలువ గట్ల వెంబడి ఉన్న బావుల్లోని నీరు ఉప్పు నీరుగా మారటంతో గొంతు తడుపుకొనేందుకు చుక్కనీరు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు.

తాగునీటి ఇబ్బందులు ఇవీ...

 కైకలూరు నియోజకవర్గంలోని లంక గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. ఆలపాడు, రామవరం, ఆచవరం, గోనెపాడు, పెంచికలమర్రు, మూలలంక, పెదలంక తదితర గ్రామాల్లోని తాగునీటి చెరువులు పూర్తిస్థాయిలో అడుగంటాయి. ఒకటి, రెండు రోజులకు మించి తాగునీటి అవసరాలను తీర్చేందుకే ఈ నీరు ఉపయోగపడుతుంది. పోల్‌రాజ్, సీబీ కెనాల్ ద్వారా లంక గ్రామాలకు తాగునీరివ్వాల్సి ఉంది. వాటికి నీరు ఎప్పుడిస్తారో అధికారులకే తెలియని పరిస్థితి.

 దివిసీమలోని కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో తాగునీటి చెరువులు అడుగంటాయి. కోడూరు మండలంలోని జరుగువానిపాలెం, వి.కొత్తపాలెం, చింతకోళ్ల, హంసలదీవి, ఇరాలి, రామకృష్ణాపురం, సాలెంపాలెం తదితర గ్రామాల్లోని చెరువుల్లోనూ అదే పరిస్థితి. బడేవారిపాలెం నుంచి పిట్లలంక, సాలెంపాలెం తదితర గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చటం లేదు.

పెడన నియోజకవర్గంలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్న కృత్తివెన్ను మండలంలో శీతనపల్లి, మాట్లం, కృత్తివెన్ను, గుడిదిబ్బ, పడతడిక, ఒర్లగొందితిప్ప, నిడమర్రు, పల్లెపాలెం, నీలిపూడి, మునిపెడ తదితర గ్రామాల్లో తాగునీటి చెరువుల్లో నీరు అడుగంటింది. ఉన్న కొద్దిపాటి నీరు రంగుమారి తాగడానికి పనికిరాని పరిస్థితి నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులో ఉన్న లక్ష్మీపురం, పల్లెపాలెం గ్రామాలకు చెందిన ప్రజలు భీమవరం వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. 20 లీటర్ల మంచినీటి క్యాన్ ఈ గ్రామాలకు చేరేసరికి రూ.40 వ్యయం అవుతోంది.
  పెడన మండలంలో 24 పంచాయతీలు ఉండగా 12 పంచాయతీల్లో రక్షిత నీటి పథకాలు ఉన్నాయి. వీటిలో రెండు పథకాలే సక్రమంగా పనిచేస్తున్నాయి. మిగిలిన పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి రోజురోజుకూ అధికమవుతోంది. బంటుమిల్లి మండలంలో మల్లేశ్వరం రక్షిత మంచినీటి పథకం ద్వారా 16 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో నీరు అడుగు మట్టానికి చేరుకుంది.

బందరు మండలంలో 34 పంచాయతీలు ఉండగా ఇవన్నీ దాదాపు సముద్రానికి సమీపంలోనే ఉన్నాయి. మచిలీపట్నం, పెడన పురపాలక సంఘాలతో పాటు మచిలీపట్నం మండలంలోని ప్రజలకు తాగునీటిని తరకటూరులోని సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు ద్వారా అందించాల్సి ఉంది. ఈ సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement