పరిహారం..బహుదూరం
ఒంగోలు టూటౌన్: కష్టించి సాగు చేసిన పంట ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయి అల్లాడుతున్న రైతులకు ఆసరా కరువైంది. రైతులకు అండగా ఉండి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేసే అరకొర సాయానికీ కాలయాపన చేస్తోంది. అధికార పగ్గాలు మారినా పరిహారం అన్నదాత దరిచేరలేదు. ఫలితంగా జిల్లాలో 1,88,945 మంది రైతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో 2010 నుంచి ఇప్పటి వరకు సంభవించిన వరుస ప్రకృతి వైపరీత్యాలకు అన్నదాత కుదేలయ్యాడు. పలు విపత్తులు రైతన్నను కోలుకోలేని దెబ్బతీశాయి. నోటికాడికొచ్చిన పంటలు నీటమునిగాయి. వరదలు ముంచెత్తాయి. తుఫాన్లు చావుదెబ్బతీశాయి. వేలాది హెక్టార్లు కొట్టుకుపోయాయి. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక విలవిల్లాడిన రైతులకు నేటి కీ నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం అలవిమాలిన నిర్లక్ష్యం చూపుతోంది.
= 2010లో జల్ తుఫాన్ ముంచెత్తింది. వందల హెక్టార్లు నీటి మునిగాయి. ఈ తుఫాన్‌కు సంబంధించి ఇంకా 72 మంది రైతులకు రూ.2.53 లక్షల పరిహారం నేటికీ విడుదలకు నోచుకోలేదు.
= 2011 ఫిబ్రవరిలో వచ్చిన గాలివానతో నష్టపోయిన 28 మంది రైతులకు అందాల్సిన పరిహారం రూ.2.13 లక్షలు నేటికీ రాలేదు. అదే ఏడాది ఏప్రిల్‌లో కురిసిన భారీ వర్షాలకు పంటలు మునిగిపోయాయి. 345 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. రూ.11.07 లక్షలు నష్టపోయినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఇప్పటికీ దిక్కుమొక్కులేదు. ఇదే ఏడాది ఏప్రిల్‌లో థానే తుఫాన్‌విరుచుకుపడింది. ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. 6,925 మంది రైతుల పంటలు కొట్టుకుపోయాయి. రూ.214.55 లక్షల పంట నష్టం జరిగింది.
= 2012 జనవరిలో భారీ వర్షాలకు 41,053 మంది రైతులు నష్టపోయారు. రూ.1663.73 లక్షలు పరిహారం నేటికీ రైతులకు అందలేదు.
= 2013 ఫిబ్రవరిలో కురిసిన భారీ వర్షాలకు 1953 రైతులు తీవ్రంగా నష్టపోయారు. రూ.114.61 లక్షల పరిహారం రావాల్సి ఉంది. ఇదే ఏడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు 32,364 మంది రైతుల పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి. రూ.19.48 లక్షలు నష్టపరిహారం రైతులకు అందాల్సి ఉంది. అదేనెల 28న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాకు వచ్చిన సందర్భంగా నష్టపరిహారంపై తీవ్ర చర్చ జరిగింది. సమావేశంలో జిల్లా అధికారులను ఆయన నిలదీశా రు. అయినా పరిహారం రైతన్న దరిచేరలేదు.
= ఇటీవల నీలం తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు రూ.16 లక్షల వరకు నిధులు విడుదలైనట్లు వచ్చిన జీవో రద్ధైయింది.
= జిల్లాలో వ్యవసాయ శాఖ పరిధిలో గత నాలుగేళ్లలో 1,62,678 మంది రైతులకు రూ.57.74 కోట్లు విడుదల కావాల్సి ఉంది.
= ఉద్యానశాఖ పంటలకు సంబంధించి 26,267 మంది రైతులకు రూ.10.63 కోట్ల పరిహారం అందాలి.
= మొత్తం మీద జిల్లాలో గత నాలుగేళ్లుగా 1,88,945 మంది రైతులకు రూ.68.37 కోట్ల పంటనష్ట పరిహారం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది.
బ్యాంకు అకౌంట్లతో తిప్పలు:
గతంలో ప్రకృతి వైపరీత్యాలకు పంటలు నష్టపోతే నేరుగా రైతులకు పరిహారం అందించేవారు. ఆ తరువాత కాలంలో చెక్కులివ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆన్‌లైన్ పద్ధతి వచ్చింది. ప్రతి రైతు ఆయా మండలాల్లో ఉన్న బ్యాంకుల్లో అకౌంట్ తీసుకోవాలి. బ్యాంకు ఖాతాకు సంబంధించిన అకౌంట్ నంబర్‌ను వ్యవసాయ శాఖ అధికారులకు ఇవ్వాలి. దీనిపై ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. వచ్చిన వరకు ఖాతా నంబర్లను ఆ శాఖాధికారులు ఉన్నతాధికారులకు పంపించారు. మొత్తం మీద ఇంకా 60 వేల మంది రైతుల ఖాతా నంబర్లను వ్యవసాయాధికారులు సేకరించలేకపోయారు. ఇటీవల పంట నష్టపరిహారానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు.
రైతుల నుంచి బ్యాంకు అకౌంట్ నంబర్లు సేకరించిన మండల వ్యవసాయాధికారులకు నోటీసులివ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అది అంతటితో ఆగిపోయింది.
కొత్త ప్రభుత్వం నిధులివ్వాలి: వ్యవసాయ శాఖ జేడీ
రూ.500 లోపు పరిహారం రావాల్సి ఉన్న రైతులు బ్యాంకు అకౌంట్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. వీరితో పాటు మరికొంత మంది స్వగ్రామంలో లేకపోవడం వల్ల వారి ఖాతా నంబర్లు రాలేదు. అకౌంట్ నంబర్లు ఇచ్చిన వారికైనా పరిహారం ఇచ్చేందుకు నిధులు విడుదల కాలేదు. కొత్త ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది.