కలిగిరి, న్యూస్‌లైన్: తీగజాతి కూరగాయలను పందిరికి అల్లించి సాగు చేస్తూ రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. తీగజాతి రకాలైన దొండ, బీర, కాకర, పొట్లకాయ వంటి కూరగాయల పంటలను సాగు చేయడానికి ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తోంది. వీర్నకొల్లుకు చెందిన ఎమ్మెస్సీ పట్ట భద్రుడైన మేదరమెట్ల వెంకటేశ్వర్లు అనే రైతు అధికారుల సూచన మేరకు పందిరిపై దొండ చెట్లను సాగు చేయడానికి ముందుకు వచ్చాడు. ఉద్యాన శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ తన ఎకరం పొలంలో పందిరిళ్లను ఏర్పాటు చేసి దొండ సాగు చేపట్టాడు. ఉద్యాన శాఖ ఎకరానికి 50 శాతం రాయితీ వంతున రూ. 60 వేలు అందించింది. తొలి సంవత్సరమే రైతుకు పెట్టుబడులు వచ్చాయి. పందిరికి అల్లించిన దొండ మూడు సంవత్సరాల పాటు ఫలితాలిస్తోంది.
పందిరిపై తీగజాతి కాయలను పండించడంతో పంటకు కలుపు బెడద ఉండదు. కాయలు వృథాగా పోవు. తక్కువ సమయంలోనే కాయలను కోసే అవకాశం ఉండటంతో కూలీల సంఖ్య తగ్గి ఖర్చులు తగ్గుతాయి. నాణ్యమైన కాయలను కోసి వెంటనే అమ్ముకోవడం వల్ల రైతులు లాభాలు ఆర్జించవచ్చు. చెట్లకు ఎరువులను వేయడం, పురుగు మందులు పిచికారీ చేయడం సులభంగా ఉంటుంది. కూరగాయల సాగుచేసే రైతులకు ఉద్యానశాఖ 50 శాతం రాయితీతో విత్తనాలను సరఫరా చేస్తోంది. ఈ ఏడాది పలువురు రైతులు పందిరిపై కూరగాయలు సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ పండించిన కూరగాయలను నాగిరెడ్డిపాళెంలో సంత లో అమ్ముకునే అవకాశం ఉండటంతో సాగు సులభమైంది.