ప్రాజెక్టులన్నీ ‘స్విస్ చాలెంజ్’లోనే
సింగపూర్ ప్రతినిధి పిళ్లైకి స్పష్టీకరించిన సీఎం
సైబర్ సెక్యూరిటీకి విన్-విన్ విధానంలో సహకరిస్తామని హామీ
హైదరాబాద్: రాష్ట్రంలో ఇకపై ప్రాజెక్టులన్నింటినీ స్విస్ చాలెంజ్ విధానంలోనే చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రతినిధి గోపీనాథ్ పిళ్లైకి స్పష్టం చేశారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధి గోపీనాధ్ పిళ్లై సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పిళ్లై మాట్లాడుతూ రాష్ట్రంలో ఏయే రంగాల్లో పెట్టుబడికి అవకాశముందో పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకు చంద్రబాబు స్పందిస్తూ రాష్ట్రంలో అపారమైన సహజ వనరులున్నాయని, విస్తారమైన ఖనిజ సంపద ఉందన్నారు. ఎర్రచందనం నుంచి భారీఎత్తున ఆదాయం రాబడుతున్నామన్నారు.
ఈ నేపథ్యంలో పిళ్లై మాట్లాడుతూ తమ దేశంలో సైబర్ సెక్యూరిటీ కల్పించేందుకు సహకరించాలని కోరారు. ఇందుకు సీఎం స్పందిస్తూ సాంకేతిక నిపుణుల్ని సింగపూర్‌కు పంపుతామని, విన్-విన్ విధానంలో సంయుక్తంగా పనిచేసి సమస్యల్ని అధిగమిద్దామన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తారమైన అవకాశాలున్నాయన్నారు. విజయవాడ, విజయనగరం, తిరుపతి, రాజధాని ప్రాంతమైన అమరావతిలో పర్యాటకుల్ని ఆకట్టుకునే ప్రదేశాలు మరిన్ని ఉన్నాయని తెలిపారు.
ఈ సమావేశంలో సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, విద్యుత్తు శాఖ కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులు ఎస్.ఎస్. రావత్, పీవీ రమేష్, ఏపీఎస్‌ఎస్‌డీసీ సీఈవో గంటా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పిళ్లై... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో సమావేశమయ్యారు. దేవాదాయ విధానం, స్మార్ట్ సిటీస్, స్కిల్ డెవలప్‌మెంట్, పరిశ్రమలు, మౌలిక వసతులు, వ్యవసాయ విధానం, మత్స్య ఉత్పత్తి, రాజధాని మాస్టర్ ప్లాన్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కార్యాచరణ అందజేస్తాం
చంద్రబాబుతో ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తామూ ఓ కార్యాచరణ ప్రణాళికను అందజేస్తామని ఆస్ట్రేలియా ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. స్పోర్ట్స్,వాటర్ రిసోర్సెస్ యూనివర్సిటీల్ని నెలకొల్పితే సహకరిస్తామన్నారు. ఆ దేశ కౌన్సెలర్ సీన్ కెల్లీ బృందం గురువారం సచివాలయంలో బాబుతో సమావేశమైంది.
పాల ఉత్పత్తిలో మెరుగైన ఫలితాల కోసం ఆధునిక సాంకేతికతను సమకూర్చుకోవాలని బృందం సూచించింది.స్పందించిన సీఎం... ముడి ఇనుము, బెరైటిస్ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, అధిక ఆదాయ వనరుగా మార్చటానికి సూచనలిస్తే ఆహ్వానిస్తామన్నారు. క్రీడా విశ్వవిద్యాలయం ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఇటువంటి నైపుణ్య కేంద్రాలు మరిన్ని ఏర్పాటైతే నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. కాగా ఏపీ వర్సిటీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెట్టొచ్చని, ఇందులో ఏపీలో మూడున్నర సంవత్సరాలు శిక్షణ పొందితే, మిగిలిన ఒకటిన్నర సంవత్సరాలు తమ దేశంలో వృతిపరమైన శిక్షణ ఇస్తామని ఆస్ట్రేలియా ప్రతినిధులు సీఎంకు చెప్పారు.
సీఎం క్యాంప్ ఆఫీస్‌కు నిరంతర విద్యుత్
విజయవాడలో జూన్ 2వ తేదీన ప్రారంభం కానున్న సీఎం క్యాంప్ ఆఫీస్‌కు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీఎస్‌పీడీసీఎల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం తో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వారంలో మూడు రోజులు ఉండే అవకాశాలున్నందున.. వారందరి ఆఫీసు గదులు, నివాసపు క్వార్టర్లకు విద్యుత్ లైన్లు వేస్తున్నారు. దీంతో బెజవాడ చీఫ్ ఇంజనీర్ రాజబాపయ్య గురువారం విద్యుత్ పనులను పరిశీలించారు.