ఆ ‘దిశ’గా అతివకు అండగా... | Protection Laws For The Protection Of Women | Sakshi
Sakshi News home page

ఆ ‘దిశ’గా అతివకు అండగా...

Published Thu, Dec 12 2019 8:26 AM | Last Updated on Thu, Dec 12 2019 8:26 AM

Protection Laws For The Protection Of Women - Sakshi

సాక్షి, విశాఖపట్నం, అల్లిపురం(విశాఖ దక్షిణం):  మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ఉద్ధేశించిన చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తాజా బిల్లు చట్టంగా మారితే..అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి మరణశిక్ష విధిస్తారు. అత్యాచారాన్ని నిర్ధారించే ఆధారాలు లభ్యమైతే కేవలం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చట్టంలో మార్పులు తీసుకువస్తున్నారు. వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, మరో 14 రోజుల్లో విచారణ జరిపించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చట్టంలో మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. అత్యాచారం, సామూ హిక అత్యాచారం, యాసిడ్‌ దాడు లు, వేధింపులు, లైంగిక వేధింపులు వంటి నేరాలకు విచారణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కో ర్టులు ఏర్పాటు చేయా లని మంత్రి వర్గం తీర్మానించింది. మహిళా భద్ర తపై కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలపై మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తోంది.

పోక్సో చట్టం...  
18 ఏళ్లలోపు ఉన్న మైనర్లపై అత్యాచారం, అత్యాచారానికి యత్నించడం, నగ్నంగా చిత్రీకరించడం లాంటి వాటికి పాల్పడితే వారికి ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. లైంగిక దాడి చేసినా.. నగ్నంగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించినా మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు ఖైదు తప్పదు. ఒక్కోసారి జీవితఖైదు కూడా విధించవచ్చు. 

అక్రమ రవాణా నిరోధక చట్టం..
బాలికలు, యువతులను అక్రమంగా రవాణా చేయడం, మాయమాటలు చెప్పి.. ఆశచూపి వారిని వ్యభిచార గృహాలకు అమ్మేయడం, బలవంతంగా వ్యభిచారం చేయించడం వంటివి నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనల్లో నిందితులకు రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. కేసు తీవ్రతను బట్టీ ఒక్కోసారి ఏడేళ్ల నుంచి జీవితఖైదు కూడా పడే అవకాశం ఉంది. 

బాల్య వివాహాల నిషేధ చట్టం... 
18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేయాలని చూడడం చట్టరీత్యానేరం. బాల్య వివాహాలు చేయాలని ప్రయతి్నంచిన వారికి రెండు ఏళ్ల జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. 

నిర్భయ చట్టం.. 
►మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారికి ఏడేళ్ల పాటు జైలుశిక్ష లేదా.. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. శిక్ష అనుభవించి బయటకు వచ్చిన అనంతరం మరోసారి అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష తప్పదు.  
►మహిళలను లైంగికంగా వేధించడం, వీడియోలు, ఫొటోలు తీసి బెదిరించిన వారికి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. 
►సామూహికంగా లైంగికదాడికి పాల్పడిన వారికి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష, మరోసారి అదేపని చేస్తే వారికి ఉరిశిక్ష తప్పదు.   
►యాసిడ్‌ దాడికి పాల్పడిన వారికి పదేళ్ల జైలుశిక్ష, యాసిడ్‌ దాడికి ప్రయతి్నంచిన, బెదిరించిన వారికి ఐదేళ్ల పాటు ఖైదు తప్పదు. 
► పనిచేసే ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా తాకడం, వేధించడం చేస్తే మూడేళ్ల పాటు జైలుశిక్ష, మహిళను వివస్త్రను చేసి వేధిస్తే మూడేళ్ల జైలు, జరిమానా విధిస్తారు.  

గృహహింస చట్టం..  
భార్యను భౌతికంగా, లైంగికంగా, మానసికంగా, ఆర్థికంగా హింసిస్తే గరిష్టంగా 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. మద్యం తాగి భార్యను కొట్టడం, హింసించడం, వరకట్నం కోసం వేధించడం, చిత్రహింసలు పెట్టడం, ఇళ్లలో నిర్భంధించి కొట్టడంతో పాటు, భర్త, అతని తల్లి, తండ్రి, బంధువులు కుటుంబసభ్యులు ఎవరైనా గృహహింసకు పాల్పడితే వారికి ఈ చట్టం కింద 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తారు.  

సైబర్‌మిత్ర... 
వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో మహిళలు, యువతులను కొందరు ఆకతాయిలు వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారు. వారి ఫొటోలను మారి్ఫంగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేయడం, మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు పోలీసుశాఖ సైబర్‌ మిత్రను అందుబాటులోకి తీసుకువచ్చింది. తమ సమస్యలను తెలియజేసేందుకు సైబర్‌ మిత్ర ఫోన్‌ నంబరు 91212 11100కు వాట్సప్‌ చేయవచ్చు. లొకేషన్‌ షేర్‌ చేయడం ద్వారా తాము ఆపదలో ఉన్నామని పోలీసులకు తెలియజేసి వెంటనే సాయం పొందవచ్చు. ఈ నెంబరు 24 గంటలూ పనిచేస్తుంది. 

డయల్‌ 182.. 
మహిళలు, ఒంటరిగా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా వేధింపులకు గురిచేసినా, ఆపదలో చిక్కుకున్న సందర్భాల్లో 182 నంబర్‌కు ఫోన్‌ చేయాలి. ఆ కాల్‌ రైల్వే డివిజన్‌ పరిధిలోని రైల్వే రక్షకదళం(ఆర్‌పీఎఫ్‌) కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది. బాధితులు అందించిన వివరాల ఆధారంగా ఆ రైల్లో ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది వెంటనే బోగీలోకి చేరుకుని సాయం అందిస్తారు.  

డయల్‌ 112 
ఆపదలోవున్న మహిళల కోసం కేంద్రహోంశాఖ 112 నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బాధితులు దేశంలో ఎక్కడినుంచైనా ఈ నంబర్‌కు కాల్‌ చేసి సమస్యను తెలియజేస్తే ఏ రాష్ట్రం నుంచి కాల్‌ వచ్చిందో ఆ రాష్ట్ర పోలీసు కంట్రోల్‌రూమ్‌కు విషయాన్ని తెలియజేస్తారు. అక్కడి సిబ్బంది వెంటనే సంబంధిత పోలీసులను అప్రమత్తం చేసి బాధితులకు సాయం అందిస్తారు. అవసరమైతే గస్తీ వాహనాలను సంఘటనాస్థలానికి పంపుతారు. ఈ ప్రక్రియ అంతా నిమిషాల వ్యవధిలోనే జరుగుతుంది.

డయల్‌ 100
రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా 100 నంబర్‌కు డయల్‌ చేస్తే అది పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది. ఫోన్‌ చేసిన వారు తామెదుర్కొంటున్న సమస్యను వివరిస్తే చాలు.. సిబ్బంది అప్రమత్తమవుతారు. సంబంధిత ప్రాంతంలోని పోలీసులకు సమాచారం అందిస్తారు. అలాగే గస్తీ వాహనాలను కూడా అప్రమత్తం చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో 4 నుంచి 6 నిమిషాలలోపు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుంటారు. జీపీఎస్‌ లోకేషన్‌ ఆధారంగా బాధితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కాపాడతారు. అవసరమైతే ఘటనా స్థలానికి చేరుకునేంత వరకు పోలీసులు బాధితులతో ఫోన్‌లో మాట్లాడుతూ సూచనలు, సలహాలు ఇస్తూ ధైర్యం చెబుతారు. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలి. 

సంపూర్ణ రక్షణ దిశగా...  
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీలో మహిళల భద్రతకు చేపడుతున్న చర్యలు దేశ చరిత్రలో ప్రథమంగా నిలుస్తాయి. దిశ చట్టం ఏర్పాటుకు  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆనందదాయకం. ఈ చట్టం రాష్ట్రంలో మహిళలకు రక్షణ చట్రంగా మారుతుంది. సంపూర్ణ రక్షణకు దోహదపడుతుంది. మన రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం ప్రభుత్వం స్పందించిన తీరు ఆదర్శనీయం. అలాగే సోషల్‌మీడియాలో మహిళలను కించపరిచినా.. కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం శుభపరిణామం.  
– చెట్టి పాల్గుణ, అరకు ఎమ్మెల్యే 

నిజమైన  మహిళా రక్షకుడు... 
మహిళల రక్షణ కోసం చర్యలు చేపట్టి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దేశ చరిత్రలోనే మహిళా రక్షకుడిగా నిలిచారు. అసెంబ్లీలో మహిళా భద్రతకు సంబంధించిన బిల్లుకు∙ కేబినెట్‌ ఆమోదం తెలపడంతో పాటు, పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయం. తెలంగాణలో జరిగిన దిశ హత్యాచార ఘటనతో సీఎం జగన్‌ తీవ్రంగా కలత చెందారు. ఏపీలో మహిళల రక్షణకు దిశ చట్టంను తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇది శుభ పరిణామం. దిశ చట్టం మహిళలకు కొండంత రక్షణగా నిలుస్తుంది. విచారణ పేరుతో సాగదీత ఉండదు. కేవలం 21 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా చట్టం రూపొందించాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరుగుతుంది. మహిళలు స్వేచ్ఛగా జీవించడం కోసం సీఎం కీలక నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయం. చాలా సంతోషంగా ఉంది.     – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి , పాడేరు ఎమ్మెల్యే 

చట్టాలు తెలుసుకోండి...  
ప్రభుత్వం తాజా నిర్ణయం అభినందనీయం. చిన్నారులు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు చేయాలంటే మృగాళ్ల గుండెల్లో వణకు పుట్టాలి. జిల్లాలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు తప్పు చేసిన వారికి త్వరగా శిక్ష పడుతుంది. నేరాలు తగ్గుతాయి. మహిళలందరూ చట్టాలను తెలుసుకోవాలి. మహిళలు క్లిష్ట పరిస్థితుల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. ఆపదని తెలిస్తే పోలీస్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్లకు ఫోన్‌చేయాలి.  
 –ప్రేమ్‌కాజల్, ఏసీపీ, ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement