
అర్ధనగ్న ర్యాలీ చేస్తున్న ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు
చిత్తూరు, యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక వైపు ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు, మరో వైపు పోస్ట్ డాక్టరల్ ఫెలో(పీడీఎఫ్)లు విడివిడిగా తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టారు. టైంస్కేల్ డిమాండ్ చేస్తూ ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు ఈ నెల 19 నుంచి పోరుబాట పట్టారు. మరో వైపు తమకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని పీడీఎఫ్‌లు సోమవారం నుంచి దీక్షలు చేపట్టారు. కాగా హాస్టల్ ఉద్యోగులు కూడా ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.
ఈ ఆందోళనల్లో భాగంగా మంగళవారం ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మహిళా ఉద్యోగులు కళ్లకు గంతలతో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ముందుగా గోల్డన్ జూబ్లీ ఆర్చి వద్ద నుంచి పరిపాలన భవనం వరకు ర్యాలీ చేశారు. పరిపాలన భవనం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు ఆముదాల చిరంజీవి, నాగవెంకటేశు, బాలనరసింహారెడ్డి, మఠం గిరిబాబు పాల్గొన్నారు. అలాగే ఉద్యోగ భధ్రత కోరుతూ పీడీఎఫ్‌లు నిరసన దీక్ష కొనసాగించారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు వెంకటస్వామి, కాసారం లత, గంగాధర్ తదతరులు పాల్గొన్నారు.