ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఆదిరెడ్డి ఆగ్రహం
రాజమండ్రి కార్పొరేషన్ : ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీనైన తనను కార్యక్రమానికి సరిగా ఆహ్వానించకపోవడంపై విద్యుత్ శాఖాధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో తనను భాగస్వామిని చేయకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్థానిక కోరుకొండ రోడ్డులోని మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించనున్న సబ్‌స్టేషన్‌కు మంగళవారం శంకుస్థాపన జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరుకాకుండానే శంకుస్థాపన ప్రారంభించేశారు.
విషయం తెలుసుకున్న ఆదిరెడ్డి అక్కడికి చేరుకున్నారు. తాను రాకుండా సబ్‌స్టేషన్ శంకుస్థాపన ఎలా చేశారంటూ ఆ శాఖ అధికారులపై మండిపడ్డారు. తనకు ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ విద్యుత్ శాఖ అధికారులను నిలదీసి, అక్కడ బైఠాయించారు. వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీనైన తనను చిన్నచూపు చూడడం సబబుకాదంటూ దుయ్యబట్టారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తనకూ భాగస్వామ్యం ఉందని, ఇటువంటి చర్యలు మానుకోకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మరోసారి పునరావృతమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందన్నారు. అనంతరం సబ్ స్టేషన్ నిర్మాణానికి కొబ్బరి కాయకొట్టి పనులు ప్రారంభించారు.