దేవుడు నా మొర ఆలకించాడు: పృథ్వీరాజ్‌ | Prudhvi Raj Offers Prayers At Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీరాజ్‌

Published Sun, Jul 28 2019 8:05 PM | Last Updated on Sun, Jul 28 2019 8:16 PM

Prudhvi Raj Offers Prayers At Tirumala - Sakshi

సాక్షి, తిరుమల : కలియుగ దైవం శ్రీనివాసుడిని ఆదివారం  ప్రముఖ సినీ నటుడు, ఎస్వీబీసీ ఛానల్‌ చైర్మన్‌ పృథ్వీరాజ్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు పృథ్వీరాజ్‌కు వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు. అలాగే పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. శనివారం ఆయన శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు.

స్వామివారి దర్శనం అనంతరం పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ....స్వామివారి అనుగ్రహం లేకుంటే దర్శనానికి కూడా రాలేమని అన్నారు. అలాంటిది ఏకంగా స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కలిగిందన్నారు. శ్రీవారికి సేవ చేసే భాగ్యం తనకు దక్కిందని, శ్రీవారి కైంకర్యాలు ప్రసారమయ్యే ఎస్వీబీసీ చానల్‌ను గాడిలో పెట్టి, అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇన్నాళ్లకు ఆ దేవదేవుడు నా మొర ఆలకించారు. సినీ పరిశ్రమలోనే కాకుండా, తిరుమల కొండపై కూడా సేవ చేసుకునే అదృష్టం కలిగింది. భగవంతుడి ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరి సహకారంతో 24 గంటలూ పనిచేసి, అందరితో శభాష్‌ అనిపించుకుంటాం. తనను అందరూ 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటారని, అలాగే ఎస్వీబీసీ ఛానల్‌ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా పృథ్వీరాజ్‌ బాగా పని చేశారనేలా అనిపించుకుంటామన్నారు.

ఇక ఉద్యోగులను కుటుంబసభ్యుల్లా భావిస్తూ అందరిని కలుపుకొని ఎస్వీబీసీ చానల్‌ అభివృద్ధికి పాటుపడుతానని తెలిపారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చానల్‌ను తీర్చిదిద్దుతానన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని కాలినడకన గతంలో తిరుమలకు వచ్చి స్వామి వారిని వేడుకున్నానని తెలిపారు. తాము కక్ష పూరితంగా వ్యవహరించబోమని, అవినీతికి పాల్పడి ఉంటే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్వీబీసీలో అక్రమాలు జరిగాయని భక్తులు ఆరోపిస్తున్నారని, దేవుడికి సంబంధించింది దేవుడికే చెందాలన్నది తన సిద్ధాంతమని అన్నారు. దేవుని సొత్తు జేబులో వేసుకోవాలి అనుకొనే వారికి కనిపించని నాలుగో సింహంలా స్వామివారే తగిన గుణపాఠం చెబుతారన్నారు. చిత్తూరు జిల్లాతో కూడా తనకు అనుబంధం ఉందని, తాను ఏడో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ శ్రీకాళహస్తిలో చదువుకున్నానని పృథ్వీరాజ్‌ తెలిపారు. నటుడు జోగినాయుడు కూడా స్వామివారిని దర్శించుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement