ఆరునెలల్లోనే టీడీపీపై ప్రజా వ్యతిరేకత
జీలుగుమిల్లి :అధికారంలోకి రావడానికి చంద్రబాబు మోసపూరితమైన వాగ్దానాలు చేయడం వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని అన్నారు. జీలుగుమిల్లి వైఎస్సార్‌సీపీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం కక్కిరాల చక్రధర్ నివాసంలో పార్టీ మండల కన్వీనర్ బోధాశ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆళ్లనాని మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచేందుకు అమలుకాని వాగ్దానాలు చేసి రైతులు, మహిళలు, నిరుద్యోగులను, పేదలను చంద్రబాబు నట్టేట ముంచారన్నారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్ఫథంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని చెప్పారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవకపోయినా ఇప్పటికీ పార్టీకి వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు ఉన్నారన్నారు. మండలంలో ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా అందరూ కలిసి కట్టుగా ముందుకు నడవాలన్నారు.
త్వరలో మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తామని, అవసరమైన చోట గ్రామాల్లో పర్యటిస్తామని తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల అభిప్రాయాలు అడిగారు. పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. తొలి సంతకం అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పరిపాలన ప్రారంభంలో పెట్టిన సంతకమే అన్నారు. అందుకు భిన్నంగా చంద్రబాబునాయుడు కల్లబొల్లి కబుర్లు చెబుతూ తొలి సంతకం అర్ధం మార్చేశారన్నారు. ప్రతి కార్యకర్త సేవాభావంతో పనిచేయాలన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారని అందుకు చంద్రబాబు ఇచ్చిన హామీలే కారణమన్నారు. పార్టీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు గంటాప్రసాదరావు, క్రమశిక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు రామతిరుపతిరెడ్డి, జేపి, జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్ కొవ్వాసి నారాయణ, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షులు వందనపు సాయిబాలపద్మ, జిల్లా అధికార ప్రతి నిధులు పోల్నాటి బాబ్జి, ఎం.సంపత్‌కుమార్, డీసీసీబీ డెరైక్టర్ శ్రీనివాస్, బి.ప్రేమ్‌కుమార్, ఆరేటి సత్యనారాయణ, కె.వెంకటేశ్వరరావు, ఎం.రామచంద్రరావు, సిర్రిమోహన్, కె.చక్రి, కె.రాము, కె.సూరి, దాసరి బాబ్జి, డి.వేణు,వై.సత్యనారాయణ, జి.బాబ్జి పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
కొయ్యలగూడెం : వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ శ్రేణులు సమన్వయంతో వ్యవహరించాలని, ఐక్యతతో కలిసి ప్రజా సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్(నాని) పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సర్పంచ్‌ల చాంబర్ ఉపాధ్యక్షురాలు దేవి గంజిమాల ఆధ్వర్యంలో మండల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మట్టా శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
టీడీపీ రాక్షస పాలనపై పోరాటానికి అండ
టి.నరసాపురం : టి.నరసాపురం మండలంలో టీడీపీ రాక్షసపాలనపై పోరాటానికి కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటానని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఆళ్ళ నాని అన్నారు. స్థానిక కాశీ విశ్వేశ్వరాలయ కల్యాణ మంటపంలో మంగళవారం రాత్రి పార్టీ మండల కన్వీనర్ దేవరపల్లి ముత్తయ్య అధ్యక్షతన మండల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో వైఎస్‌ఆర్ కార్యకర్తలతో సైన్యాన్ని తయారు చేస్తానన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు జగన్‌మోహనరెడ్డి పిలుపుతో ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు.