కాంగ్రెస్ హైకమాండ్‌కు సీఎం కిరణ్ చురకలు
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి పరోక్షంగా చురకలంటించారు. రవీంద్ర భారతిలో గురువారం జరిగిన తెలుగు భాషా దినోత్సవ సభలకు హాజరైన సీఎం ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆద్యంతం ప్రజలు, పార్టీలు మధ్యే సాగింది. ‘ మన ప్రజా స్వామ్యంలో ప్రజలే కీలక నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఒకవేళ పార్టీలు నిర్ణయాలు తీసుకోదలిస్తే.. ఆ ప్రభుత్వానికి ప్రజలు పూర్తిగా సెలవు ప్రకటిస్తారన్నారు. పార్టీలు, ప్రభుత్వాలు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుందనుకోవడం పొరపాటన్నారు’.
సరైన నిర్ణయాలు తీసుకోని ప్రభుత్వాలకు ప్రజలు ఎన్నోసార్లు సెలవు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వాలను, పార్టీలను ప్రజలు మార్చిన సందర్భాలెన్నో ఉన్నాయని సీఎం తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయకుంటే ఇబ్బందులు తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన చాలా సున్నితమైనదని..ఇటువంటి తరుణంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ క్లిష్టమైన సమయంలో ఓపిక, సహనం కోల్పోకూడదని.. సమ్మెలు, నిరసనలు చట్టపరిధిలో శాంతియుతంగా చేసుకోవాలన్నారు. ఎవరికైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇబ్బందులు తప్పవన్నారు. వాటిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయన్నారు.