సరైన సమయంలో నిర్ణయం
మీ అందరి సహకారం కావాలి
విభజనపై సుప్రీంను ఆశ్రయిస్తాం
సీమాంధ్ర విద్యార్థులతో కిరణ్
సాక్షి, హైదరాబాద్: సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని, తనకు యువత సహకారం కావాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పరోక్షంగా కొత్త పార్టీ విషయాన్ని బయటపెట్టారు. విభజనకు వ్యతిరేకంగా సుప్రీంను ఆశ్రయించేందుకు అన్ని అవకాశాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. సమైక్యం కోసం పోరాటం ఆగదని, ప్రజలతో కలసి ముందుకు నడుస్తానని చెప్పారు.
ఆయన బుధవారం ఇక్కడ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు, విద్యార్థులతో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ సీపీ చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని ఆరోపించారు. దీన్ని వ్యతిరేకిస్తూ సీఎం పదవికి, శాసనసభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, తానూ సామాన్య యువత మాదిరిగా నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌గా మారానని చెప్పారు. ఇంకా ఆయనేమన్నారంటే...
ఢిల్లీలో క్యూకట్టిన మంత్రులు మాదిరిగానే నేనూ కాంగ్రెస్ పార్టీ మాట విని ఉంటే నా భవిష్యత్తూ బాగుండేది. కానీ నేను వారిలా కొనసాగలేను. ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. రాష్ట్ర యువత కోసమే నా ఆరాటం.
పార్టీ పెట్టే విషయంలో నేనింకా నిర్ణయం తీసుకోలేదు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాను. మీ అందరి సహకారం కావాలి. కాంగ్రెస్ బీ ఫారాలు మనకు అక్కర్లేదని మన సత్తా ఏమిటో చాటుదాం.
అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ఆమోదించి రాజ్యాంగాన్ని కించపరిచారు. ప్రత్యక్షప్రసారాలు నిలిపేసి ఎంపీలను సభలోనే కొట్టారు. పార్లమెంటు, దేశం మొత్తం సిగ్గుతో తలదించుకొనేలా చేశారు. ఇలాంటి అక్రమ బిల్లును గౌరవించాలా? ఇంత అవమానం జరిగాక మనం గమ్మున ఉండాలా?
రాజధాని కూడా లేకుండా బయటకు గెంటేసి ఇప్పుడు కొత్త రాజధాని పేరిట చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. విభజన ప్రక్రియ 3, 4 మాసాలు పట్టాల్సి ఉండగా కోర్టుకెళ్తారన్న భయంతో త్వరగా పూర్తి చేసేందుకు కుట్ర చేస్తున్నారు.
విభజన వల్ల తెలంగాణకు ఎక్కువ నష్టం. దాదాపు 100 టీఎంసీల నీటిని ఆ ప్రాంతం కోల్పోతుంది. విద్యుచ్ఛక్తిలో 50 శాతం తక్కువ ఉత్పాదన ఉన్నందున మరిన్ని సమస్యలు తప్పవు.
తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉంటూ ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకోలేని అసమర్థుడు చంద్రబాబు. ఇలాంటి వ్యక్తా రాష్ట్రానికి నాయకత్వమిచ్చేది? ఇక వైఎస్సార్ కాంగ్రెస్ ఆర్టికల్-3 ప్రకారం విభజన చేయాలని లేఖ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కేసీఆర్‌కు, సీమాంధ్రలో వైఎస్ జగన్‌కు అప్పగించేసి విభజన చేశారు.