నిజామాబాద్‌స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ఈరోజు దేశంలో బ్యాడ్మింటన్ అంటే గోపీచంద్. ఆ క్రీడకే వన్నెతెచ్చిన గొప్ప ఆటగాడు. అంతర్జాతీయంగా ఆటలో రాణించి దేశ కీర్తిని ఇనుమడింపజేశాడు. ఇప్పుడు బ్యాడ్మింటన్ కోచ్‌గా క్రీడలో శిక్షణ ఇస్తూ సైనానెహ్వాల్, పి.వి. సింధూలాంటి ఎంతోమంది క్రీడాకారులను తయారుచేశాడు. అందరితో శభాష్ అనిపించుకుంటూ.. అందరి మన్ననలను పొందుతున్న గోపీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. క్రీడలతో దేశానికి సేవచేస్తున్న ఆయనను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌కు ఎంపిక చేసింది.
ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగినట్లుండే గోపీ మనోడే. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)కి చెందిన సుభాష్‌చంద్రబోస్, సుబ్బారావమ్మల ముద్దుల కుమారుడే పుల్లెల గోపీచంద్. ఆయనకు అన్న రాజశేఖర్, చెల్లె సుమబిందు ఉన్నారు. కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేసే తమ పిన్ని షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతుండటాన్ని చిన్నప్పటి నుంచి ఆసక్తిగా చూసిన గోపీ ఆ ఆటపై మక్కువ పెంచుకున్నారు. నిత్యసాధనతో దానిపై పట్టుసాధించారు. ఐవోబీ బ్యాంక్ ఉద్యోగి అయిన సుభాష్‌చంద్రబోస్ ఉద్యోగరీత్యా వివిధ ప్రదేశాలకు బదిలీ అయ్యారు. అలా వారి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ప్రభుత్వం శనివారం రాత్రి పద్మభూషణ్‌కు గోపీచంద్‌ను ఎంపికచేయడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తంచేశారు.
ఎంతోమందిని తయారు చేశారు..
చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం అలవర్చుకొన్న గోపీచంద్ ఉత్తమ క్రీడాకారుడిగా, ఉత్తమ శిక్షకుడిగా ఎదిగారు. సైనానెహ్వాల్, సింధూ, కశ్యప్ తదితర క్రీడాకారులు ఆయన శిష్యులే. ఈరోజు ఆయనకు పద్మభూషణ్ రావడంతో జిల్లా క్రీడాకారులు, ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. -కర్నేటి వాసు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి
యువక్రీడాకారులకు ఆదర్శం..
క్రీడాకారుడిగా, కోచ్‌గా పుల్లెల గోపీచంద్ అందనంత ఎత్తుకు ఎదిగారు. పద్మభూషణ్ పొందిన ఆయన మన జిల్లావాసి కావడం గర్వకారణం. టీవీల్లో ఆయన ఆడిన ఆటను చూసి నేను బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా ముందుకెళ్తున్నాను. నాలాంటి యువ క్రీడాకారులందరికీ గోపీ ఆదర్శం. -నవీన్, పాలిటెక్నిక్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
ఆలస్యంగా వచ్చిన ఆనందమే..
గోపీచంద్‌కు చాలా కాలం క్రితమే ఈ అవార్డు రావాల్సి ఉంది. ఆలస్యంగా వచ్చినా చాలా ఆనందంగా ఉంది. బ్యాడ్మింటన్ క్రీడలో తాను ఎదగడమే కాకుండా ఎంతోమంది క్రీడాకారులను ఆయన తయారు చేశారు. -సంఘమిత్ర, క్రీడాకారుడు, నిజామాబాద్
పుల్లెల గోపీ మనోడే
Published Sun, Jan 26 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement
Advertisement