పుల్లెల గోపీచంద్
వాళ్లిద్దరి మధ్య మరిన్ని ఫైనల్స్: గోపీచంద్
Published Tue, Jan 28 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
లక్నో: హైదరాబాదీ స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధుల మధ్య ఇకపై మరిన్ని ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఆదివారం ముగిసిన సయ్యద్ మోడి ఇండియన్ గ్రాండ్ ప్రి టైటిల్ పోరులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు తలపడిన సంగతి తెలిసిందే.
తాజాగా భారత మూడో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మభూషణ్’కు ఎంపికైన గోపీచంద్ తన శిష్యురాళ్ల ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘చైనా ఆటగాళ్ల ఆధిపత్యానికి మనవాళ్లు గండికొట్టారు. ఇండి గ్రాండ్ ప్రి ఫైనల్లో ప్రతి పాయింట్ కోసం ఇద్దరూ కష్టపడి బాగా ఆడారు. అందుకే సుదీర్ఘ ర్యాలీలు సాగాయి’ అని గోపీ చెప్పారు. సైనా, సింధు ఫైనల్‌కు చేరడంతో తన బాధ్యత పూర్తయిందని, అందుకే తుది పోరుకు కోచింగ్‌కు దూరంగా ఉన్నానని తెలిపారు.
‘ఈ టోర్నీలో సింధు బాగా ఆడింది. అయితే సైనాకు మాత్రం తీపిగుర్తునిచ్చిన ఈవెంట్ ఇది. వైఫల్యాలకు తెరదించుతూ సాధించిన టైటిల్ విజయం నిజంగా ఆమె ప్రగతికి నిదర్శనం’ అని 40 ఏళ్ల గోపీచంద్ అన్నారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో చేజేతులా ఓడిన మరో ఏపీ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌కు ఈ టోర్నీ ఓ పాఠంలాంటిదన్నారు. అనుభవలేమితోనే చేదు అనుభవం ఎదురైందని చెప్పారు. ఏదేమైనా శ్రీకాంత్ గతేడాది నుంచి నిలకడైన ఆటతీరుతో మంచి విజయాలు సాధించాడని ప్రశంసించారు.
Advertisement