రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 12న ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. సంక్రాంతి పర్వదినాన వధువరులైన పార్వతీ మల్లికార్జున....
అశ్వవాహనంపై ఆదిదంపతులు
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 12న ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. సంక్రాంతి పర్వదినాన వధువరులైన పార్వతీ మల్లికార్జున స్వామివార్ల పుష్పోత్సవ, శయనోత్సవ సేవలను చివరి రోజు ఆగమ సాంప్రదాయనుసారం నిర్వహించారు. అంతకు ముందు అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్లను అశ్వవాహనంపై అధిష్టింపజేసి అర్చకులు, వేదపండితులు వాహనపూజలు జరిపారు. ఆ తర్వాత అశ్వవాహనాధీశులైన ఆదిదంపతులను మూడు సార్లు ఆలయప్రదక్షిణ చేయించి యథాస్థానానికి చేర్చారు. అనంతరం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం వద్ద స్వామివార్ల పుష్పోత్సవ సేవకు పరిమళభరితమైన పుష్పాలతో మండపాన్ని సన్నద్ధం చేశారు.
ఈ సేవ పూర్తయ్యాక.. రాత్రి 10 గంటల తర్వాత స్వామిఅమ్మవార్లకు వేదమంత్రోచ్ఛారణ మధ్య మంగళవాయిద్యాల నడుమ శయనోత్సవ సేవా కార్యక్రమం అద్దాల మండపంలో నిర్వహించారు. 11 రకాల పరిమళ భరిత పుష్పాలు, 11 రకాల ఫలాలతో అద్దాల మండపంలోని ఊయల తల్పాన్ని అలంకరించి శ్రీ పార్వతీ మల్లికార్జున స్వామివార్ల ఏకాంతసేవను ఆగమ సాంప్రదాయానుసారం వేదమంత్రోచ్ఛారణ మధ్య చేపట్టారు. కార్యక్రమంలో ఈఓ సాగర్‌బాబు, ఏఈఓ రాజశేఖర్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, శ్రీశైలప్రభ సంపాదకులు అనిల్‌కుమార్, అర్చకులు, వేదపండితులు, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.